పుట:హరివంశము.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

510

హరివంశము

     నతనియస్త్రముల విహ్వలుఁడై జలేశుండు కర్తవ్య మేమియుఁ గానఁ డయ్యె
     నగ్నిమండలచండమై మండు దైత్యునాననమును దేఱి చూడను వశంబు
ఆ. గాకయుండె నట్లు కడు నుగ్రుఁడై యసు, రోత్తముండు వరుణు నుసుఱుగొందు
     నింకఁ దడవు సేయ నేటికి నని యొక్క, పరిఘ మెత్తుకొనియె బలము మెఱయ.154
వ. అమ్మహాపరిఘంబు కేలం గొని త్రిప్పునప్పుడు సప్తపవనస్కంధసప్తమునిసప్తాశ్వ
     సుధాకరగ్రహనక్షత్రదివ్యవిమానమేఘచయమండితం బగు గగనమండలం
     బంతయు నదభ్రభ్రమితం బైనయ ట్లుండె నట్టి యాయుధంబు వూఁచి యతండు
     వరుణుముందటి సైన్యంబులం బొడిసేసి యతనిని వ్రేసినఁ దదీయగాత్రస్పర్శనం
     బున నది తుత్తుము రయ్యెం దచ్ఛకలంబులు ఖద్యోతంబులపోలిక నెల్లదెసలం
     జెదరె నట్టివేటున నిశ్చలుం డైయున్న ప్రాచేతసుచేతనాస్థైర్యశరీరశక్తివిభవం
     బులు సకలభూతంబులుం బ్రశంసించె నంత.155
తే. సప్తపాతాళపతు లగుసర్పపతుల, నెల్లఁ గనుఁగొని యాదోగణేశ్వరుండు
     పనిచె బ్రత్యర్థి దలపడి ప్రకటసత్త్వ, మంతయును జూపు డని పేర్మి యతిశయిల్ల.156
క. ఏలిక పనుచుటయు విష, జ్వాలోత్కటదంష్ట్ర లతులశస్త్రంబులుగా
     గాలాగ్నిచ్ఛటలకరణి, వాలి కడగె నురగతతు లవష్టంభమునన్.157
వ. విప్రచిత్తి యవ్విధంబునకు నల్ల నగుచు గారుడం బగునస్త్రంబు ప్రయోగించిన
     ననేకంబు లగు గరుడాకారసాయకంబు లడరి ఘోరవిదారణం బొనర్చి సంగ
     రోర్వి దర్వీకరశరీరశకలంబులం గప్పెఁ దదనంతరంబ.158
మ. తనకుం జేయగఁ గల్గుభృత్యు లరిదోర్దర్పంబుచే మ్రగ్గఁగాఁ
     గని చిత్తంబున స్రుక్కియుం గడఁక డక్కంజాల కబ్ధిప్రభుం
     డనిరోధోద్ధతబాణవేగమున దైత్యాధీశ్వరున్ ముంచె నా
     తని నాతండును నొంచెఁ జాపధరుఁడై తత్తుల్యబాణావలిన్.159
క. వరుణుండు విప్రచిత్తియు, దుర మొనరింపంగ నొక్కతూకున శౌర్యం
     బరుదై చెల్లఁగ దైత్యుండు, పరిభవముగఁ దలఁచె నట్టిభావము తనకున్.160
వ. అట్టి మత్సరంబునం దోడ్తోన వర్ధిల్లు నుద్ధతిం బ్రదీప్తమానప్రాణుం డగుపూర్వ
     గీర్వాణు గర్వంబుచేత నెత్తువడి వడిచెడి వరుణుం డపసరణంబ శరణంబుగా శత
     మఖుం డున్న దిక్కునకు నరిగె నతనితోడన సైన్యంబులుం జనియె నివ్విధంబున.161
క. వసురుద్రాదిత్యాదులు, ప్రసభంబున రిఫుల చేతఁ బరిభవభూరి
     వ్యసనము నొందుటఁ గనుఁగొని, యసహాయుం డగ్నిదేవుఁ డతిరోషమునన్. 162
వ. ఆత్మగతంబున.163