పుట:హరివంశము.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 10.

511

తే. అమరులకు నేన దిక్కు హవ్యములు మోచీ, పెట్టి పోషింతు నిటు కీడు పుట్టినప్పు
     డగునె యొప్పరికింప నామగఁటిమియును, వేఁడిమియుఁ జూపి పరిమార్తు విమతతతుల.164

అగ్నిదేవుండు సంరంభవిజృంభితుం డై దైత్యసైన్యంబులనెల్ల దైన్యంబు నొందించుట

వ. అని తలంచి లోహితవాహనంబును వాయుచక్రంబును ధూమధ్వజంబును నర్చి
     ర్మయంబును నగురథం బెక్కి రక్తవర్ణంబును బిశంగకేశశ్మశ్రుతనూరుహంబును
     నగు దేహంబు దనరారం దైజసంబు లగు నాయుధంబులు ధరియించి నిజోత్సా
     హంబునకు నమర్త్యులు సంతసిల్ల మునులు ప్రస్తుతింప నడరి దైత్యసైన్యంబుఁ
     జొచ్చి యొక్కొక్క మొత్తంబున వేలు పదివేలు లక్ష యను సంఖ్యలం గల దాన
     వులఁ బ్రేల్పం దొడంగెఁ దదీయసఖుం డగుజగత్ప్రాణుండు ప్రతిభటప్రాణహారి
     యగురభసంబునఁ జెలికానికడిమికిం దోడ్పడియె సంత నెల్లదెసల నాభీలంబు
     లగుకీలంబులు రథంబులం చక్రకూబరకేతనయుగత్రివేణుకంబుల
     నుద్ధూతధూమంబు లై యెసంగి యస్త్రధనుఃకవచంబులు సమరి ఖడ్గక్షురికాదు లతి
     దాహభంగురంబులుగా నొనర్చి కరులం బొదివి కర్ణరంధ్రంబులు సొచ్చి కర
     వివరంబులు దూఱి దంతంబులు గమల్చి కక్ష్యాకుథప్రముఖంబులు సుఱసుఱ
     పుచ్చి తురగంబులం దగిలి మోరలు నఱికి బంధురస్కంధకేసరపుచ్ఛరోమవల్ల
     రుల బెరసి వీఁపు లెరియించి మహాశరీరు లగువీరుల నరికట్టి మకుటకేశవస్త్ర
     మాల్యంబులు పొడవడంచి చర్మమాంసాస్థిమేదోవసామజ్జ లొక్కటిగాఁ గలంచి
     సమరభూమి యంతయు సంతప్తమేదోమజ్జాప్రవాహబహుళంబుఁ గావించె
     నివ్విధంబునం గల్పాంతకల్పం బగు మహాదహనవిహారంబునకు సమస్తభూతం
     బులు భీతిభ్రాంతంబు లయ్యె దనుజులు తల్లడిల్లి పెల్లెసఁగు నార్తస్వనంబులతోడ
     మయశంబరుల మఱుంగు సొచ్చి రది యంతయుం గనుంగొని.165
క. పర్జన్యవరుణమాయా, సర్జన మొనరించి వారు సమధికయత్నం
     బూర్జితముగ నయ్యనలుని, భర్జనశక్తి యడఁగించి పరఁగిరి కడిమిన్.166
తే. అసురవర్యులమాయల నగ్నిదేవు, కడఁక పొనుపడఁ దొడఁగుట గని రయమున
     దేవమంత్రి యేతెంచి యాదేవపూజ్యు, నలఘుఫణితుల నిట్లని తలఁచెఁ బ్రీతి.167
సీ. కనకంబు నీరేత మనిలుఁడు నీయాత్మ యేడుజిహ్వలతోడ నెందు నొప్పు
     దీవు జలంబుల నీవు పుట్టించితి సలిలంబు గ్రిందు పార్శ్వములు మీదు
     నై సర్వతోగాము లగుముఖంబుల పేర్మిఁ బరఁగుదు భూతసంభవకరుఁడవు
     భూతధారకుఁడవు భూతసంహర్తవు యజ్ఞంబు నీవ హవ్యంబు నీవ
తే. హవ్యవాహుండవును నీవ హవ్యభుజుఁడ, వీవ నీ విత్తు లక్ష్మియు నిద్ధజయము
     నాశ్రితులకు నీయాశ్రితు లఖిలసురులు, జాతవేద వేదములు నీసంస్తవములు.168