పుట:హరివంశము.pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 10.

493

క. మీపెద్దతాతఁ బోలుము, దీపింపు ప్రతాపలక్ష్మి దితిజుల కెల్లన్
     దేపవగు మనుచు దీవన, లేపార సురారు లాబలీంద్రున కొసఁగన్.9
వ. ఇ ట్లభిషేకించిన యనంతరంబ దొర లెల్లను దండప్రణామంబులు సేసి యంజలి
     పుటఘటనంబులు శిరశ్శేఖరంబులం బెలయ నతని కి ట్లనిరి.10
మ. భవదీయప్రపితామహుండు మహితోద్భాసిప్రతాపాఢ్యుఁ డ
     వ్యవసన్నోదయుఁ డాహిరణ్యకశిపుం డాత్మీయసత్త్వంబునన్
     భువనాభోగము లన్నియుం దనవశంబుం జేసి వర్తిల్లఁగాఁ
     బ్రవరశ్రీసుఖలీలలం గనుట సెప్పన్ వింటె వీరోత్తమా.11
ఆ. కపటనరమృగేంద్రకాయుచే నతనిఁ జం, పించి యేమి చెప్పఁ బెరిఁగి సురలు
     శక్రునకుఁ దదీయసంపద యిచ్చి యే, లించి రీజగత్ప్రపంచ మెల్ల.12
ఉ. ఇంతయుఁ జూచియుం గడిమి కేమియుఁ గోల్పక లావుకల్మి దు
     ర్దాంతుల మయ్యు నే మిటు నిరాశ్రయతాదశ బ్రుంగియుండి నీ
     యంతటి రాజు నిప్పుడు ప్రియం బెసఁగం గని మిన్ను దాఁకి య
     త్యంతపరాక్రమక్రియకు నఱ్ఱులు సాఁచెద ముబ్బుపెంపునన్.13
క. నీయాద్యుల యైశ్వర్యము, నీయదిగాఁ గ్రమ్మఱం గొనిన లెస్స మహో
     పాయుఁడ వై మముఁ జేకొని, చేయుము బవరంబు లక్ష్మి చేరెడు నిన్నున్.14
క. బలవిక్రమములఁ గడుమి, క్కిలి తేఁకువ గలవు నీవు కినిసిన నెదురం
     గలరె నిలింపులు వారల, కొలఁదు లెఱుఁగ వెట్లు సరకుగొనకుము బుద్ధిన్.15
వ. మా విన్నపం బనధరించి రాజధర్మం బవలంబింపు మనిన నయ్యసురల వచనంబులు
     రుచియించిన విని వైరోచనుం డాక్షణంబ.16
క. గెలుతు నవశ్యము నమరులఁ, బొలివోనిపరాక్రమంబు భువనభయదమై
     వెలయఁగ వెలుఁగుదు నని య, గ్గలిఁ బగఱమీఁద నడువఁ గౌతూహలియై. 17
వ. సర్వసేనాపతులును సర్వసైన్యసమేతంబుగా వెడల నాజ్ఞాపించి ప్రస్థానభేరి
     చేయించిన.18
క. అరదంబులుఁ గుంజరములు, హరులుఁ బదాతులును బహుసహస్రము లోలిన్
     దరతరమ దైత్యు లత్యు, ద్ధురశౌర్యులు వెలువడంగఁ దొడఁగిరి గడఁకన్.19
మ. హరితాశ్వంబులు వేయు పూనినమహార్హస్యందనం బెక్కి యా
     హరిదశ్వుం బ్రహసించుచుం గరసహస్రాభీలతం జాపము
     ద్గరఖడ్గాదివిచిత్రశస్త్రము లనేకంబు ల్లలిం దాల్చి ని
     ర్భరబాణుం డగు బాణుఁ డొప్పె సమరప్రస్థానసంరంభియై.20
వ. ఇట్లు వెడలిన బలితనయు నిరుగెలంకుల ననేకరథసహస్రంబులు పరివేష్టింప నతని
     కత్యంతాప్తు లైన సుబాహుండు మేఘనాదుండు గజముఖుండు వేగవంతుండు