పుట:హరివంశము.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

494

హరివంశము

     గేతుమంతుండు నను నేవురు రథికులు రథంబు గదిసి కావలి యై కొలిచిరి
     మఱియు.21
చ. ఎలుఁగులు వేయు పూనినసితేతరలోహరథంబుమీఁదఁ గ్రొ
     న్నలుపగు మేను నీలమణినవ్యవిభూషలనొప్పురూపుగా
     మలఁచినకొండభంగి నసమం బగు చీఁకటిప్రోవుకైవడిన్
     బలుఁ డరిగెం గోరపటుబాణుఁడు తేరులు కోటి గొల్వఁగన్.22

పులోమహయగ్రీవప్రముఖదనుజముఖ్యులు యుద్ధంబునకు వెడలుట

చ. కినుకఁ బులోముఁ డుద్యదహికేతనుఁ డర్వదివేలు తేరు లు
     బ్బున నడువం గదాకలితభూరిభుజుం డయి యుష్ట్రలక్షపూ
     నినయరదంబుపైఁ దనదునిల్వు యుగక్షయహేతు కేతువో
     యనఁ జనియెన్ సరత్నమకుటాంశులు ప్రజ్వలితాగ్నిచాడ్పుగన్.23
మ. సితవస్త్రాభరణప్రసూనముల లక్ష్మీమంతుఁడై శ్వేతప
     ర్వతతుల్యుండు సితాశ్వలక్షయుతదివ్యస్యందనస్థుం డలం
     కృతసప్తాశ్వసితాహికేతుఁడు హయగ్రీవుండు పేర్చెన్ ఘనా
     వృతినిర్ముక్తశరచ్ఛశాంకుఁ డన విద్విష్టాంబుజశ్రేణికిన్.24
తే. స్ఫురితతాలధ్వజంబును హరిసహస్ర, రాజితము నైనమాణిక్యరథముమీఁద
     నరిగెఁ బ్రహ్లాదుఁ డమరభయంకరు లగు, కింకరులు కోటిరథికు లశంకఁ గొలువ.25
మ. అలఘుస్వర్ణభుజంగకేతులసితం బై వేయునిన్నూఱు కి
     ష్కులవిస్తారము నాల్గుగండ్లు నమరన్ శుంభన్మృగేంద్రాస్యవా
     జులు వే పూనినమేటితేరిపయి నక్షోభ్యుం డనుహ్లాదుఁ డి
     మ్ముల నేగెం దనుఁబోలు దైత్యులరథంబుల్ గోటి సుట్టుం జనన్.26
చ. కనకమృగేంద్రకేతు వెసఁగం దురగంబులు వేయి పూనఁగా
     ననుపదురత్నదీప్తియుతమై నవసాంధ్యపయోధరద్యుతిన్
     ఘనతరనేమిఘోష పటుగర్జఁ దనర్చురథంబుతో మయుం
     డనిభృతమాయుఁ డొప్పె నుదయస్థదివాకరుఁ గ్రేణి సేయుచున్.27
శా. శార్దూలంబులు వేయి పూనురథరాజం బొప్పఁగాఁ గేతువుల్
     శార్దూలాంకముగా ఖరాళికలితోద్యత్స్యందనుల్ దానవుల్
     శార్దూలంబులువోలె నర్వది సహస్రంబుల్ దనుం గొల్వంగా
     దోర్దర్పోజ్జ్వలమూర్తియై నముచిదైత్యుం డేఁగె నిశ్చింతతన్.28
ఉ. అంబరమధ్యవర్తి యగునంబుజబాంధవుఁబోలి క్రౌంచకా
     యం బగు కేతువున్ హరిసహస్రము గల్గిన తే రెలర్పఁగా
     శంబరుఁ డేఁగెఁ గోటిరథచారులు గొల్వఁగఁ బెంపుమీఱి ది
     వ్యంబు పసిండినేవళము హస్తి కమర్చిన కక్ష్య గ్రాలఁగన్.29