పుట:హరివంశము.pdf/540

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

హరివంశము

ఉత్తరభాగము - దశమాశ్వాసము

     వేమక్ష్మానాథ మ
     హావిభుతావశ్యబహునృపాశ్రయ సుకర
     శ్రీవిశ్రాణనవైశ్రవ
     ణావజ్ఞా చతురచతురుపాయవిధిజ్ఞా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు నారసింహావతారంబు
     విస్తరించి వైశంపాయనుం డింక వామనప్రాదుర్భావం బెఱింగించెద నవ
     హితుండ వై విను మని జనమేజయున కి ట్లనియె.2
క. జనవర బ్రహ్మకు మానస, తనయుఁ డగుమరీచిసుతుఁడు ధన్యతపోవ
     ర్తననిధి కశ్యపుఁ డాతని, యనుఁగుసతులు గలరు దితియు నదితియు ననఁగన్.3
వ. దితికి హిరణ్యకశిపు హిరణ్యాక్షులు పుట్టి రదితికి ధాతయు నర్యముండును విధా
     తయు మిత్రుండును వరుణుండును నంశుండును భగుండును నింద్రుండును
     వివస్వతుండును బూషుండును బర్జన్యుండును ద్వష్టయు నను నాదిత్యులు పది
     యిద్దఱు పుట్టిరి తదనంతరంబ హిరణ్యకశిపు పిమ్మట ప్రహ్లాదుండు రాజై దివిజుల
     జయించునంతటి తేజంబు చాలకుండెఁ దత్తనూజుం డగువిరోచనుండు నట్టివాఁడ
     యయ్యె వైరోచనుం డగుబలి తద్దయు బలిష్ఠుం డై.4
ఉ. దానము సత్యముం దపము ధర్మము నెందుఁ బొగడ్త కెక్క వి
     జ్ఞానము శాస్త్రనిశ్చయవిశారదమై వెలయం గృపారతం
     బైనమనంబుతో సరసిజాసనుఁ డాదిగఁ బెద్దలెల్ల నౌ
     నౌనన నుల్లసిల్లె ననపాయసముజ్జ్వలనైజతేజుఁడై .5
తే. అతనిప్రపితామహుం డగునా హిరణ్య, కశిపునంతటివానిఁగాఁ గని దనుజులు
     గడఁగి దైత్యేంద్రపదవికి నొడయుఁ జేయఁ, దలఁచి ప్రార్ధించి రెలమి నందఱును గూడి.6
వ. ప్రహ్లాదవిరోచనసమేతంబుగా సర్వప్రయత్నంబులం బొదలి.7
శా. గంగాసాగరసంగమాదివిలసత్కల్యాణతీర్థాంబువుల్
     గాంగేయోజ్జ్వలకుంభసంభృతముగాఁ గావించి దివ్యౌషధీ
     మాంగల్యాక్షతపుణ్యగంధతతితో మంత్రజ్ఞపూర్వంబుగాఁ
     దుంగస్వర్ణమయాసనస్థు నభిషిక్తుం జేసి రవ్వీరునిన్.8