పుట:హరివంశము.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

458

హరివంశము

     దొడంగెదవు సర్వభూతంబుల కాదికర్తవు సర్వసత్త్వంబులకు నజేయుండవు
     సర్వధర్మప్రవర్తకుండవు మానుషప్రకృతిం జెంది బాలుండు గ్రీడ ననేకవస్తువుల
     వినోదించువిధంబునఁ బ్రమోదించెదవు సర్వజ్ఞుండవు నీయెఱుంగనియది లేదు
     మాబోంట్లకు సమ్మోహనం బొదవించుకొఱ కిట్టివాఁడ వైతి. అది యెఱుంగుట
     గహనం బెట్లున్న నుండుము రక్షణీయుండ నగుదు నన్ను రక్షింపుము నీకు
     మ్రొక్కెద ననిన నక్కరుణాకరుండు కరుణాపేశలుం డై పాశపాణిం జూచి.284
క. వాణీవిభవమున నతి, ప్రీణన మొనరించి యిట్లు ప్రిదులఁ దలఁచె దా
     బాణుపసి నొసఁగ కూరక, ప్రాణత్రాణంబు నీకుఁ బడయఁగ వశమే.285
వ. ఇంత యెఱింగి బుద్ధిమంతుండ వగు మనిన నవ్వరుణుండు దేవా దేవద్విషుండు
     పశుధనంబు నిల్లడ వెట్టునప్పు డెవ్వ రడిగినఁ బ్రాణాత్యాయపర్యంతంబుం బెనంగు
     నదిగాని యీఁదగ దని సమయంబు సేయించుకొనియెఁ బలుకు దప్పనోడుదుఁ
     దగవు లెల్ల నడప నొడయండ వింత యవధరింపుము.286
క. నను మన్నింపఁగఁ దలఁచిన, మనిచి పసులమీఁదితలఁపు మాని చను పసిం
     గొనిపోకయ నిర్బంధపు, బనియైనం బండె నాకుఁ బాపం బనఘా.287
తే. ఇది నిజంబుగఁ జెప్పితి నెట్లు చూడఁ, బోలె నట్లు చేయుము మహాపురుష! పూజ్య!
     యనిన నల్లన నవ్వి దివ్యాస్త్రవహ్ని, యుడిపి గోధనాపేక్షయు నుజ్జగించి.288
వ. తదనురూపం బగుసల్లాపం బొనర్చి యదునాథుండు యాదోధినాయకునకు నభయం
     బిచ్చి యతనిచేత ననర్ఘ్యరత్నపూర్ణం బగు నర్ఘ్యప్రదానంబునం బూజితుం డై
     తదీయలోకంబు వెలువడి నిజస్థానాభిముఖుం డయ్యె నయ్యవసరంబున.289
సీ. ఆదిదేవుఁడు విష్ణుఁ డఖలలోకహితార్థ మాశ్చర్యకార్య మి ట్లాచరించి
     వేడ్కఁ బురంబు ప్రవేశించునప్పుడు మిక్కిలివిభవంబు మెఱయవలదె
     యని పురందరుఁడు సర్వామర్త్యులను నారదాదిసిద్ధులను సమస్తభువన
     వాసులఁ గొనుచు నవ్వాసుదేవునిఁ గొనవచ్చి దీపవిమానవైభవముల
తే. నంబరము తిగ్మకిరణసహస్రభాసు, రంబు సేయుచు దివ్యతూర్యధ్వనులను
     గుసుమవృష్టిని సంస్తుతిఘోషములను, హృష్టజనవర్గములకు నిం పెసఁగఁ గొలిచె.290
వ. అవసరోచితం బైన తదీయసేవాధర్మధుర్యుండు గావున నాత్మీయభావంబునం బరి
     గ్రహించి యయ్యింద్రు ననుగ్రహించి యగ్రేసరం బై సురప్రకరంబు మార్గం
     బొసంగ ననర్గళోత్సవంబున.291
చ. గరుడమయూరయానములఁ గంజదళాక్షుఁడు పుత్రపౌత్రసం
     భరితవిభూతి యై దివిజపఙ్క్తులచూడ్కుల కెల్ల నుత్తరో
     త్తరకుతుకానురంజనవిధాయక మైన విధం బెలర్పఁగా
     నరిగె నపూర్వసమ్మదభరార్ద్రతఁ దానును బూర్వజన్ముఁడున్.292