పుట:హరివంశము.pdf/507

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 8.

459

వ. ఇ ట్లరిగి నిజరాజధాని నంతంతం గని విజయసూచకం బగు క్రమంబునం బాంచ
     జన్యశంఖధ్వానం బొనర్చిన.293
చ. విని యదువంశవృద్ధులు ప్రవృద్ధకుతూహలలీలమైన బురం
     బునకుఁ బ్రభూతశోభనవిభూషణభంగులు సంఘటింపఁగాఁ
     బనిచి రథద్విపాశ్వభటబంధురసైన్యసహస్రలక్ష్మితో
     ననుజతనూజపౌరసచివాన్వితు లై యెదురేఁగి రర్థితోన్.294
క. అటమున్న వచ్చి నగరని, కటకేళీవనములందు గరుడని డిగి వి
     స్ఫుటనిర్జరపరిపాలో, త్కటముగఁ బరమేశుఁ డుండెఁ గడుమోదమునన్.295

శ్రీకృష్ణుం డింద్రాదిదేవతలతో ద్వారకాపురంబునకు వచ్చుట

వ. ద్వారకానివాసు లనేకమంగళతూర్యజయాశీర్వాదనాదంబుల నద్దేవు దర్శించి
     రమ్మహానుభావుం డట్లు సనుదెంచి యాత్మీయజనంబు నఖిలంబును సముచితప్రకా
     రంబు లగు సత్కారంబుల గారవించి దారుకసారథికం బగు రథం బగ్రజతనూజ
     సమేతంబుగా నెక్కి మయూరావతీర్ణు లగు నుషానిరుద్ధుల నుద్ధతస్యందనా
     రూఢులం జేసి వినతాతనయుండు వినతుండై కొలువ నఖిలనిలింపులు నిలింప
     పతి మున్నుగా ననుసరింపఁ బెంపారి పురంబు ప్రవేశించె నంత.296
క. తన విజయవార్త యంతన, యనేకముఖములఁ బ్రసిద్ధ యై పురజనులన్
     జనితవచోవిభవులఁగా, నొనరింపఁగ నిరుగెలఁకుల నుద్భటఫణితిన్.297
సీ. అదరుటగ్నులకోటు లార్పి బ్రహ్మాదులుఁ జొర లేని బలిసూనుపురముఁ జొచ్చెఁ
     బ్రమథవీరులుఁ దానుఁ బన్నినమిక్కిలికంటివేల్పునకు నగ్గలికఁ జూపె
     నాఱుమోములపట్టి కడ్డమై వచ్చినదాక్షాయణికిఁ బుత్రభిక్ష యొసఁగె
     దనయిచ్చఁ బగవానిదర్ప మంతయుఁ బుచ్చి యిరుగేలితోఁ బ్రాణ మిచ్చి కాచె
తే. సురలు బంట్లయి తిరిగెద రరిది యెల్ల, భువనములకు నితఁడు రాజు భూరితేజుఁ
     డివ్విభుని రాజుగాఁ గంటి మెట్టిపుణ్య, మట్టితప మెట్టిభాగ్య మి ట్లెసంగె మనకు.298
వ. అని యనేకవిధంబుల వీతెంచు సంతోషకలకలంబు వీనుల కానందం బొసంగ
     నాకసంబునం దొరఁగు దివ్యపుష్పవర్షంబులం బెరసి పుణ్యాంగనాకరకలితలలితా
     క్షతవిక్షేపంబులు కిరీటకుసుమస్రగుత్తరీయాదులం దగిలి మిగిలిన యెప్పిదం
     బొనర్పఁ దరుణీవిలోచనరోచులు రుచిరస్మితచంద్రికలఁ దార్కొన నర్కప్రభాపరి
     భావి యై భవ్యకౌస్తుభగభస్తిరాగంబున ననురాగరమ్యం బగు పురం బంతయుం
     గుంకుమపంకాభిషేకంబున నుత్సేకంబు నొందింప మందానిలాందోళితమణిధ్వజ
     వైజయంతీవిరాజితం బగు రాజమార్గంబునం జని యదురాజు రాజమందిరంబు
     సొచ్చి యుషాసమేతంబుగా ననిరుద్ధు నంతఃపురంబునకుం బోవం బనిచె నచ్చట