పుట:హరివంశము.pdf/453

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 7.

405

     బరిభూతి న్మునుపడ్డ వేల్పుగమితో బల్వీకమై వచ్చి సం
     గర మర్ధించినబాణు బాహుతతికిం గామ్యార్ధముల్ నిండవే.49

కుంభాడుఁడు బాణునితో మహోత్పాతంబులు పుట్టుట చెప్పి పరితపించుట

[1]తోటకము. తన క్రొవ్వుల నైనది తాఁ గనియెన్
     మన కే మని యాత్మఁ గుమారగురుం
     డని యొప్పరికించె నహా యిఁక న
     య్యినతేజునకుం దుది యెయ్యెదియో.50
వ. అని మఱియు నీదృశవితర్కంబుల నానాఁటికి డెందంబు గందుచుండ సంధులు
     ప్రిదిలి యొక్కనాఁ డమాత్యుం డమ్మహాదైత్యుపాలికిం జనుదెంచి సవినయం
     బుగాఁ గదిసి యుత్పాతంబులతెఱంగు సెప్పి యింద్రోపేంద్రులవైరంబునుం
     దెలియఁ బలికి మీఁదు లెస్సగాకుఁడు ననియ నుగ్గడించిన విని నవ్వి యవ్వీ
     రుండు.51
మ. విను కుంభాండ యజాండ మింతయును నే సుద్వృత్తిఁ బైఁ బడ్డ బొం
     కని హుంకారమ యిచ్చి యాఁగుదు విభగ్నాత్ముండు దీనుండు ము
     న్నును శక్రుండు తదీయవాంఛకయి విష్ణుం డాజికిం బూనినన్
     బనిదీఱె న్బలియాఁక మాన్పఁగను నబ్భాగ్యోదయం బల్పమే.52
క. ఇప్పటియుత్పాతంబుల, యొప్పిద మంతయును వేగ యుద్ధోత్సవముం
     దప్పింపఁజాల వొకటియుఁ, జెప్పుమ మఱియొకటి నాకుఁ జెప్పకు మింకన్.53
వ. అని పల్కిన లెస్స గాక యని యతం డరిగి యుచితవ్యాపారంబుల నుండె బాణుం
     డును సుధాకరదీధితి సంగమశోభాసనాథంబు లగు సౌధంబులఁ బ్రతిదినసవర్ధ
     మానరాగుం డై వర్తిల్లుచు.54
సీ. కనకకుంభంబులగర్వంబు చులకగాఁ గల్పించువలిచన్నుఁగవలవ్రేఁగు
     నిండారుచందురునెరసు తక్కువపడఁ దిలకించుముద్దుమోములబెడంగు
     వలరాచతూపులవలను [2]మొక్కలువోవ వాలుఁగ్రెఁగన్నులవాఁడిమియును
     బాలపల్లవములలీలలు పొలివోవ మించారుకెంగేలిమేలిమియును
తే. [3]మనము సొక్కింపఁజాల నింపెనయుబోటి, పదువు పొదువంగఁ గ్రీడైకపరత నొంది
     యొం డెఱుంగండు భోగించుచుండె గీత, వాద్యనృత్యమధూత్సనవ్యాప్తరతుల.55
సీ. ఆదైత్యనాథునియాత్మజ యుష యనుపేర నొప్పారెడివారిజాక్షి
     యమృతాంశుకళ కన్యయై తోఁచె ననఁ బుష్పసాయకు[4]పూవమ్ము చామ యయ్యె

  1. క. తన క్రొవ్వున నైనదిదా, గనియె మనకు నేమి యనుచుఁ గడంగి గుహగురుం
         డని నొప్పరికించెనె యి, య్యినతేజునకుఁ దుది యిప్పు డెయ్యదియొ కదా.
  2. మోక
  3. తనమనంబు సొక్కించి పనియింపెనయు
  4. పుపుటమ్ముచాయ