పుట:హరివంశము.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

404

హరివంశము

     జని నేఁ డేను నిరంతరాభిముఖు నాసర్వజ్ఞు నర్థించితి
     న్ననుఁ దృప్తుండుగఁ జేయఁ జాలు సమరోన్మాదంబు మోదంబుగన్.39
వ. అమ్మహాదేవుండును నా విన్నపం బవధరించి నీవు నీ మయూరధ్వజంబ నిమిత్త
     భగ్నం బగుట కోర్చియుండు మదీయనిమిత్తంబుగా నీ కోరినట్టికయ్యం
     బయ్యెడి నని యానతిచ్చిన నిచ్చోటకు వచ్చి యీ యభ్యుదయంటు నీ కెఱింగించితి
     ననిన నతండు.40
క. కడఁ జిన్నవోయి యిది యె, క్కడియొప్పమి సేసికొంటి గరకంఠుని నేఁ
     డడిగితి విట్టిది వరముగఁ, జెడియెం బ్రహ్లాదకులము చెప్పఁగ నేలా.41
మహాస్రగ్ధర. అను మండం జండవజ్రాహతగిరినిభమై యమ్మయూరధ్వజం బా
     దనుజేంద్రుండుం బ్రధానోత్తముఁడును గనఁగా ధాత్రిపై భగ్నమై మ్ర
     గ్గిన హర్షోదగ్రలీలం గెరలె నతఁ డసంక్లిష్టదోర్దండకండూ
     యనఘోరస్ఫారవీరాహవము దనకు నభ్యగ్రమై తోఁచె నందున్.42
వ. తదనంతరంబ.43
ఉ. క్షోణి వణంకె దిగ్గహన ఘోరముగా దివి ధూమకేతు వ
     క్షీణతఁ దోఁచె శర్కరలు నేడ్వడఁ జల్లుచుఁ దీవ్రుఁడై జగ
     త్ప్రాణుఁడు వీచె శోణితపురం బురుశోణితవృష్టిఁ దేలె ని
     ర్వాణము లయ్యె దేవరిపువర్గము వేఁడుము లెల్ల నొక్కమై.44
వ. మఱియు ననేకభంగు లగు నుత్పాతంబులు పుట్టె నవ్విధంబునం గుంభాండుండు
     తనమనంబున నధికభీతిం బొంది.45
మ. జితలోకత్రితయుండు దైత్యుఁ డచలోత్సేకంబునన్ మాఱు లే
     క తనుం బట్టఁగరానిగర్వమున సంగ్రామంబ కాంక్షించి దు
     ర్మతియై యాత్మవినాశహేతు వగుదౌరాత్మ్యంబు గావించె నే
     గతిఁ బెంపొందిన నాసురప్రకృతి సక్కంబెట్టగా వచ్చునే.46
క. ఊరకపోవు నే యిమ్మెయి, ఘోరం బగుదుర్నిమిత్తకోటి యకట ని
     ష్కారణనాశము దివిజేం, ద్రారికులంబునకుఁ దప్ప దగు నెబ్బంగిన్.47
సీ. సకలసురాసురసమితికిఁ బ్రభుఁ డైనశంభుండు దారును షణ్ముఖుండు
     బాణునిపైఁ గూర్మిఁ బాయక యిప్పురిఁ గావలియై యుండుగణవరేణ్యు
     లందఱు ననురక్తు లసురేశ్వరునకు నెవ్వారికి నిచ్చోటు సేర నరిది
     యనుబుద్ధి నూఱడిల్లను రాదు మదమున నీతఁడు వేఁడిన నీశుఁ డిచ్చె
తే. గాదె వరముగ నిది దీనిఁ గడపవశమె, కలుగు నెట్లు నుగ్రపుఁబోరు బలిసుతునకు
     వేఱ ప్రతివీరు లెవ్వరు విబుధులందు, మహిమఁ బేర్కొనఁ గలిగినమగల కాక.48
మ. హరి దైతేయులమీఁద రోషకలుషుం డాశక్రుచిత్తంబునన్
     బరువై యెప్పుడు నిండియుండుఁ బగ దర్పం బొప్ప నయ్యిద్దఱున్