పుట:హరివంశము.pdf/451

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 7.

403

ఉ. భర్గుప్రసాదమున్ గుహునిప్రాపును నీ కనపాయము ల్విధూ
     తార్గళ మైనవిక్రమ ముదంచిత మి ట్లగుటన్ జగత్త్రయీ
     సర్గమునందు నెవ్వరికి సాధ్యము గానివరంబు నీమనో
     మార్గ మెఱింగి శంభుఁ డసమంబుగ నిచ్చెనె నేఁడు వేడినన్.31
శా. వైకుంఠాశ్రయగర్వి యై పొదలునవ్వజ్రిం దొలంగించి యా
     లోకం బింతయు నీవ యేలు మని త్రైలోక్యేశ్వరుం డైనయా
     శ్రీకంఠుం డొసఁగంగ నింద్రుఁడు సురశ్రేణీసమేతంబుగా
     నాకంబుం బెడఁబాసిపోవఁడు గదా నాగాలయంబుం జొరన్.32
క. జలధులఁ గ్రుంకియుఁ బన్నగ, నిలయంబులం దూఱఁబడియు నేఁడాదిగ నా
     కులపడుదితిసంతతి నీ, కలిమిఁ గనియె నయ్య దేవగణములనెలవుల్.33
సీ. పాంచజన్యధ్వని పర్విన గుండియ లవిసి చేష్టింపక యలసియలసి
     ప్రకటకౌమోదకీభ్రమణవేగంబుల దిగ్భ్రాంతి వాటిలి తిరిగితిరిగి
     నందకచ్ఛాయ నందందచీకటులు బొదివినఁ గానక యొదిగియొదిగి
     దీప్తసుదర్శనతీవ్రభానునివేఁడి పఱఁగినఁ గ్రొవ్వఱ నుఱికియుఱికి
తే. యసుర లేవీరుకడిమి నూటాడి చెడుదు, రట్టివిష్ణుని నోర్వంగ నబ్బె నేని
     మనకుఁ బరమకళ్యాణ మమ్మహిమ యొదవు, [1]వెరవు నేఁడు సూపఁడు గదా విశ్వగురుఁడు.34
వ. అదియునుంగాక.35
సీ. కఱదులాఁ డగుచక్రి కపటంపుటనువునఁ దనుమోసపుచ్చిన ధర్మరతుఁడు
     గాన సత్యం బనుకట్టునఁ దగఁ గట్టువడిపోయి పాతాళభవనకోటి
     కెల్లనుఁ గ్రిందైనయిఱుకున నున్నమీతండ్రి విరోచనతనయుఁ డెలమి
     నీయట్టిసత్పుత్రు నాయతవిక్రముఁ గనుటఁ దద్భంధమోక్షణము వడసి
తే. నేఁడు వెలువడి తనతొంటినెలవు రాజ్య, గరిమ నేతెంచెనే దివ్యగంధమాల్య
     భూషణాంబరశ్రీ లిలఁ బొలుచు నాబ, లీంద్రుఁ జూడంగఁ గాంచుట యెట్టితపమొ.36
చ. అడుగులు మూఁడుగాఁ గొలిచి యనంగ జగత్త్రయంబు నా
     గడమునఁ గొన్నయాకుటిలుఁ గానికిఁ గైకొన కెట్టులైన నే
     మడరి మహాండమధ్యవలయం బఖిలంబును నాక్రమించి నీ
     యడుగులు గొల్తు మాసరసిజాసను సృష్టి గలంతకాలమున్.37
వ. అనిన నయ్యమాత్యుమాటలకు నలంత న వ్వొలయ బలితనయుం డతని మొగం
     బునఁ జూడ్కి నిలిపి.38
మ. విను కుంభాండ యనేకకాలము మహావీరాహవప్రౌఢిపెం
     పునఁ గ్రీడింపఁగ లేక నాదగు భుజంబు[2]ల్ ముందటం బొందినం

  1. కరుణచే నీదుభక్తికిఁ గరము మెచ్చి
  2. ల్ముచ్చటం; ల్మూఁదటం.