పుట:హరివంశము.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

360

హరివంశము

స. సుపర్ణస్కంధావతీర్ణుం డై మున్ను దన్నుం గొలిచి చనుదెంచిన దేవతలు
     మునులుం బరివేష్టింప నున్నయవసరంబున.153
సీ. వ్యాసభరద్వాజవాల్మీకిగౌతమకాశ్యపజాబాలికణ్వపులహ
     యాజ్ఞవల్క్యాత్రి రైభ్యాంగిరోభృగుపరాశరధూమ్రగాలవశంఖలిఖిత
     హరితసంవర్తకహయశిరశ్శౌనకభద్ర[1]కక్షీవద్విభాండకోగ్ర
     బకదాల్బ్యకౌశికాపస్తంబమాండవ్యమంకణరోమశమందపాల
తే. కఠకలాపరోహితకామకాయనాది, మునులు చిరతపోనిర్మలమూర్తు లాఢ్యు
     లరుగుదెంచి కాంచిరి పరమాత్ము నభవు, నాదిదేవు నచ్యుతుఁ గృష్ణు నధికభక్తి.154
తే. కాంచి యర్ఘ్యపాద్యము లిచ్చి గౌరవమునఁ, బ్రణతు లై మోడ్పుఁజేతు లొప్పంగ నిలిచి
     చిత్తములు హర్షరసమునఁ జిగురులొత్త, నంగములు పులకలప్రోవులై యెలర్ప.155
ఉ. ఈయెడకుం బ్రసన్నమతి నిందఱఁ గైకొని దేవ నీవు వి
     చ్చేయుటఁ జేసి మానియమశీలత యుత్తమసిద్ధిఁ బొందె నే
     మేయది సేయువారము మహేశ్వర సత్కృప నానతిమ్ము ని
     శ్రేయసదాయి గాదె సవిశేషభవత్ప్రియకర్మ మెమ్మెయిన్.156
వ. అనినఁ బరమపురుషుం డందఱఁ బ్రసాదదృష్టిదానంబున సమ్మానించి సర్వంబును
     సువిహితంబ యని వేఱువేఱ కుశలంబు లడిగి వారల ప్రతివచనసంవిధానంబున
     నానందంబు నొంది సముచితానుష్ఠానంబు పిమ్మట నమ్మునుల కావించు విందులు
     గైకొని బృందారకమునిబృందసహితుం డై నిశాసమయసమీహితంబు లగు
     శయ్యాస్థానంబులం బ్రమోదించె నిట్లు పుణ్యనివాసంబున వసియించి యన్నారా
     యణుండు.157
క. తనపూర్వతపస్స్థానం, బని యనురాగమున బదరి యంతయుఁ జూడన్
     మనమునఁ దలపోసి యొకండును మధ్యేరాత్రమునఁ [2]గడుం గుతుకమునన్.158
వ. అచ్చోటు వాసి యిచ్చం జని గంగయుత్తరతీరంబు దొడంగి.159
సీ. పంచాగ్నిమధ్యతపస్కులు గొందఱు సలిలాధివాసనిశ్చలులు గొంద
     ఱాబద్ధతరులతాధ్యానులు గొందఱు నిరశనవ్రతసమన్వితులు గొంద
     [3]ఱమితనిరంతరయజనులు గొందఱు ప్రాణసంయమనైకపరులు గొంద
     ఱేకాంతికత్వనిశ్శోకులు గొందఱు జసయజ్ఞవిధివిచక్షణులు గొంద
తే. ఱగుచు జటిలముండితనగ్ను లాదిగా న, నేకరూపతపోనిష్ఠ లెసఁగ నొప్పు
     మునులనెలవులు ప్రీతిఁ గన్గొనుచు వివిధ, కాననాభ్యంతరంబులఁ గలయ మెలఁగి.160

  1. కటీసద్
  2. గుతుకమున నంతన్
  3. ఱార్త