పుట:హరివంశము.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - అ. 5.

361

శా. సిద్ధోద్బాసీతశృంగపంక్తులు సమానీడోల్లసత్కిన్నరీ
     బద్ధానేకవిచిత్రగానసుతలప్రస్థంబులున్ యోగిస
     న్నద్ధానందసమాధిరమ్యగుహలున్ గంధర్వవీణాధ్వనీ
     శ్రద్ధాముగ్ధమృగంబులుం గలమహా[1]శైలస్థలుల్ చూచుచున్.161
వ. పెద్దయుంబ్రొద్దు విహరించి యొక్కమనోహరప్రదేశంబున నాసీనుండై.162

శ్రీకృష్ణుఁడు బదరీవనంబున సమాధియోగంబున నుండుట

తే. అపరరాత్రంబు భవ్యసమాధివేళ, యగుట నప్పుడు తనయంతరంగమునకు
     నొలయ సుప్రసాదంబున యోగనిష్ఠ, [2]చే యలంతియై యింపారఁ జేరుటయును.163
సీ. స్వస్తికాసనము నిశ్చలముగా బంధించి తనువుఁ గంథరయు మస్తకము సరిగ
     చక్కనై నిలువ నాసాశిఖరంబున నరమోడ్పుచూడ్కి యేకాగ్రసరణి
     నిలిపి మూలాధారనిర్గతనిర్గుణదోషంబు షడ్గ్రంధిదళనకారి
     యై పోయి పరమాంబరామృతబింబంబు గరపంగఁ దోడన తొరఁగుసోనఁ
తే. దడిసి తన్మయానందతం ద్రాళువగుచు, నొకఁడు నెఱుఁగనిసామరస్యోదయమున
     నలర నెంతయు నొప్పె నయ్యాదిసిద్ధుఁ, డఖిలసిద్ధులు వనసిద్ధి యభినుతింప.164
వ. ఇవ్విధంబున నప్పరమేశ్వరుండు పరప్రణిధానంబునఁ దన్నుఁ దాన యనుసంధించి
     సంధుక్షితసంవిజ్జ్యోతి యగు చేతోవృత్తి నున్నసమయంబున నవ్వనంబునందు.165
క. మృగయాకలకల మొక్కటి, దిగంతములు మ్రోయ నుప్పతిల్లిన నాలో
     జగతీశ హరే విష్ణో, నిగమస్తుత యను నెలుంగు నెఱి వీతెంచెన్.166
సీ. అవ్విధంబున కాత్మ నద్భుతం బందెడు హరి యున్నయెడ కిందు నందు మునుఁగఁ
     బఱతెంచె నొఱలుచుఁ బటుబాణవిద్ధంబు లగుబెబ్బులులు పందు లాదియైన
     మృగములు వెనుకన యగణేయసారమేయావళు లేతెంచె నడవియెల్ల
     నొక్కవెలుంగకా నొప్పెడు వేనవేల్ దివియలతోడఁ దోతెంచి రంతఁ
తే. జాపహస్తులు తఱచుగాఁ జపలవికృత, రూపు లైనపిశాచు లాటోపదీప్తు
     [3]లోలి మాంసఖాదసముఁ గీలాలపాన, ముల నొనర్చుచు నార్చుచు బొబ్బలిడుచు.167
క. శిశువులఁ జంకల నిడుకొని, కృశకర్కశరోమరాజికృష్ణశరీరుల్
     రశనాయితాంత్రవల్లులు, పిశాచికలు వొడమి రెలమిఁ బ్రియులపిఱుందన్.168
వ. ఇ ట్లనేకసహస్రసంఖ్యులు నరుగుదెంచిన వారికి నందఱకు నగ్రణులై యిద్దఱు
     మహాపిశాచులు ధూమ్రకపిలకేశంబులు గల మస్తకంబులును వెలి కుఱికిన
     గ్రుడ్లతోడికపిలకన్నులతుదలు మురిసినయంపతునుక లెడలం జిక్కి మిక్కుటం బై
     తెలుపుమీఱినయొఱవపండ్లును శంఖనిభంబు లగుకర్ణంబులు నిర్మాంసంబులగును
     రంబులు వీఁపుల నంటికొనినకడుపులు కుఱుచచేతులు నస్థిస్నాయుమయంబు లైన

  1. శైలంబులన్
  2. సెలతియై యొప్ప యింపారిఁ జేయుటయును
  3. లొలయ