పుట:హరివంశము.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

308

హరివంశము

క. ఈరూపవంతుఁ గోరుట, యీ[1]రమణీకి నొప్పు నీమృగేక్షణమీఁదం
     గోరిక యితనిక తగె నని, భోరన నయ్యుత్సవమునఁ బొగడిరి జనముల్.218
వ. ఇట్లు నిజమనోరథానుకూల యగు నప్పుణ్యశీలం గైకొని ప్రద్యుమ్నకుమా
     రుండు సకలరాజన్యకుమారులుఁ దమతమపురంబుల కరుగఁ దానును దనపురం
     బున కరుగుదెంచి కరగ్రహణానందం బనుభవించి.219
చ. అనుపమయౌవనంబులు శుభాకృతులు న్విలసద్గుణంబులుం
     దనరు మనోరథంబులును దద్దయు ధన్యత నొంద నిత్యమో
     హనరతి నిద్దఱుం గలసియాడఁగ నమ్మదిరాక్షి గర్భశో
     భనము వహించి కాంచె సుతుఁ బ్రాగ్దిశ భానునిఁ గాంచు కైవడిన్.220
వ. అక్కుమారుం డనిరుద్ధుం డనుపేరం బ్రసిద్ధుం డై వేదంబులు ధనుర్వేదసహితం
     బులు గా నధిగమించి సకలశాస్త్రంబులను సమస్తశస్త్రాస్త్రంబులం బ్రశస్తినొంది
     గజతురగస్యందనారోహణములందు నసమానరూఢి వహించి యెలప్రాయం
     బున నెలరారు సమయంబున.221
ఆ. రుక్మవతి యనంగ రుచిరాంగి రుక్మికిఁ, బౌత్రి యైన కన్యఁ బంకజాక్షు
     నాజ్ఞ నడిగిపుచ్చె నక్కుమారునకుఁ బ్ర, ద్యుమ్నుఁ డాత్మజనని యుల్లసిల్ల.222
క. హరిదిక్కున మునుగల మ, చ్చర మించుక విడిచి మిగుల సంప్రీతిపుర
     స్పరముగ నీ నొడఁబడియెను, హరిపౌత్రున కాత్మపౌత్రి నన్నరపతియున్.223
వ. ఆ వ్వివాహోత్సవంబున రుక్మిణీసహితుం డై యనిరుద్ధుం దోడ్కొని వాసు
     దేవుండు బలదేవాదియదుముఖ్యులుం బుత్రవర్గంబును దోడ రా నుచిత
     సైన్యంబు సమకట్టి సమధికవిభవంబున విదర్భనగరంబున కరిగి వైదర్భుండు
     రావింప నతనిచుట్టంబు లగు రాజు లనేకులు వచ్చి రంతఁ బ్రశస్తతిథినక్షత్రం
     బగు దివసంబునందు శుభముహూర్తంబునఁ గుమారుండు కుమారిఁ బాణి
     గ్రహణం బొనర్చిన.224
తే. కుడిచి కట్టి చుట్టము లెల్లఁ గూడి కలసి, బెలసి పెండ్లిదినంబులు పెంపు మిగుల
     నిచ్చ నాడుచుండిరి యాదవేశ్వరుండు, నావిదర్భాధిపతియును నాత్మ లలర.225
వ. అంత వేణుధారియు [2]శ్రుతపర్వుం, గుడును నంశుమంతుండును జయత్సేనుండును
     మొదలయిన దాక్షిణాత్యులు తమలో విచారించి రుక్మిపాలికిం జని యేకాంతం
     బున నతని కి ట్లనిరి.226
ఉ. నెత్తముమీఁదఁ గౌతుకము నిర్భర మై జనియించె నిప్డు మా
     చిత్తములందు నీవు గడుఁ జిత్రపుజూదరి వాత్మలోన ను
     ద్వృత్తుఁడు సీరపాణి కడువేడుకకాఁ డతనిన్ జయింతు మే
     మిత్తఱి మ మ్మొకింత గదియింపు మొనర్పుము [3]తత్ప్రసంగమున్.227

  1. రమణిక యొప్పు
  2. శ్రుతవర్ముండును
  3. దత్ప్రకారమున్; దత్ప్రకాశతన్