పుట:హరివంశము.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 3.

309

రుక్మి బలరామునితో జూదమాడ నారంభించుట

వ. అతండు నిర్జితుం డగుట మనకు గీర్తికరం బనిన యారంతుకాండ్రకఱపులు విని
     రుక్మి వారునుం దానును మనోజ్ఞగంధమాల్యాభరణభూషితు లై కాంచనస్తంభ
     శతసంభృతంబును వితతవితానవిలసితంబును రుచిరచందనోదకసిక్తంబును ముక్తా
     ఫలప్రాలంబమాలికంబును నిరంతరకుసుమోపహారమండితంబును నగు సభామండ
     పంబునఁ బసిండిపలుకయుఁ బాచికలును నమర్చి.228
క. ద్యూతమునకు బలభద్రునిఁ, బ్రీతిసమేతంబు గాఁగఁ బిలిపించుటయున్
     ద్యూతాధికకుతుకుం డై, యాతఁడు దత్కితవగోష్ఠికై యేతెంచెన్.229
వ. దాక్షిణాత్యు లందఱుంగూడి రుక్మి నతనితో నాడుటకు నియోగించి విశదముక్తా
     మణిబహుళహేమరాసులు పణంబులుగా చెప్పించి జూదంబునకుం దొడంగి
     రందు బలదేవుండు.230
తే. పసిఁడిమాడలు పదివేలు పణము గాఁగ, నొడ్డె నొడ్డిన నాడి యత్యుద్ధతుండు
     గెలిచె వైదర్భుఁ డతని నయ్యలఘుచిత్తుఁ, డోడె నంతియ పసిఁడియ యొడ్డి మఱియు.231
క. ఆపలకయు రుక్మి సము, ద్దీపితుఁ డై గెలిచె నలుక దీపింపఁ జలం
     బేపార నిట్లు పలుమఱు, నోపిగ నాడుచును బలఁడ యోడుచు వచ్చెన్.232
వ. తదనంతరంబ కోటిసువర్ణంబులు పణంబు సేసి యాడి రౌహిణేయుండు జయంబు
     నొందిన నవ్విపక్షుం డక్షధూర్తుండు గావునం గడవ నార్చి.233
క. బలభద్రు నక్షవిద్యా, బలవిరహితు దుర్జయప్రబలసత్త్వధనున్
     గెలిచి బహుసంఖ్యహేమా, వళు లివె యేఁగొంటి ననుచు వడిఁ బలుకుటయున్.234
వ. అప్పలుకులకుం దోడ్పడి కళింగరాజును నిది యట్టిద యని దంతపంక్తి వెలిగా
     వెలయం గలకల నవ్వె నవ్విధంబు నాగడంబునకుఁ గోపం బెత్తియు మెత్తనఁ
     జిత్తంబు నియమించియు నయ్యవక్రవిక్రమోదాముం డగు రాముండు సభి
     కులం జూచి.235
క. [1]తా నిది గెలిచితి ననియెడు, నేను గెలిచి యుండ నీతఁ డిది యేటికి మీ
     రేనెఱికి నిజము సెపుఁడా, నా నొకరును బలుకరైరి నమితానను లై.236
వ. భీష్మకాత్మజుండు మఱియును.237
క. [2]ఇం దేమియునుం గలదే, సందియ మస్మజ్జయంబు సత్యము
     పొందొందని పలుకులు పలు, కం దగునే యోడి యకట కక్కుఱితి మెయిన్.238
తే. అనినఁ గేవలకపటోక్తి విని యొకటియు, ననక యూరకయుండె నయ్యదువరేణ్యుఁ
     డప్పు డాకాశవాణి యయ్యందఱకును, వినంగ నయ్యెడుకొలఁది ని ట్లనియెఁ దెలియ.239
క. నిజము వలికె హలధరుఁ డితఁ, డజితుఁడు వైదర్భుమాట యాహతము మహా
     భుజులు మహీభుజు లిట్లగు, [3]నె జడాకృతితోడఁ దగవు నెఱపక యుండన్.240

  1. క. తా నిటు గెలిచితి నని యితఁ, డేను గెలిచియుండ నీతఁ డిది యాడెఁ దుదిన్
         మీనోర నిజము సెప్పుడు, నా నొకరుం బలకరైరి నమితానను లై.
  2. ఇందే నేమియుఁ గలదే
  3. నె జయాకృతితోడఁ దగవు నెఱపకయుండన్