పుట:హరివంశము.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము . ఆ. 3.

291

వ. ఏకాంతంబ యక్కాంతదెసఁ జింతాభరంబునఁ గార్యాంతరంబులయందు నిర
     పేక్షుం డై యుండి.59
ఉ. ఎమ్మెయిఁ జూతునొక్కొ తరళేక్షణ నక్కట చూచి యెమ్మెయిం
     గ్రమ్మన నిర్వహింతునొకొ కైకొనుకర్జము [1]వేఁడి శత్రుసం
     ఘముల నెమ్మెయిం దొడరి గర్వము సొంపడఁగింతునొక్కొ యే
     నెమ్మెయి నిశ్చయింతునొకొ యింతిదెస న్మునువిన్నచందముల్.60
తే. నన్నుఁ బొడగన్నచోట నన్నలిననయన, చూపుచూపులఁ బ్రేమంబు సొంపు గనిన
     యపుడ తఱియంగ నురుకుదు. నమరు లడ్డ, [2]పడినఁ బట్టుదు నాపాణిపంకజమున.61
సీ. కమలాస్య నెమ్మోము కమ్మనితావికి దందడిఁ దమకించుతరళతయును
     ముద్దియ యెలదొక్కు ముద్దారుఁబలుకులు వినఁగ నుత్తలపడువేడుకయును
     బూఁబోఁడి నెమ్మేనిఁ బొంది యానందంబు గడగానఁ బూనెడుకౌతుకంబు
     గామిని కొండొండ కడలొత్తుకోర్కులు నిండింపఁ గాంక్షించునెఱగడఁకయు
తే. భామయును నేను నన్యోన్యభావమగ్ను లగుట యెఱింగినయాప్తజనాళి ప్రియము
     నిర్వహింపంగఁ గలుగుట నిక్కమునకు, నవయ నేభంగి భాగధేయంబొ నాకు.62
క. అని యివి మొదలుగఁ బెక్కులు, దనమదిఁ దలపోయునతనితలఁపులు సిద్ధిం
     దనరింపఁగఁ జనుదెంచిన, యనుపమభాగ్యంబు నా నిశాంతం బయ్యెన్.63
ఉ. పాడె మధువ్తావళులు పద్మవనీవిభవంబు శాపముల్
     వీడె రథాంగకంబులకు వేడుకఁగూడి తరంగడోలలం
     దాడె మరాళదంపతులు హాసవిలాసము దక్కి గ్రక్కునన్
     వాడెఁ గుముద్వతీముఖము వావిరి నూడెఁ దమోనిబంధముల్.64
క. అరుణోదయరాగంబునఁ, గర మలరెడు పూర్వదిఙ్ముఖంబున వెలసెన్
     సరసిజమిత్రసమాగమ, పరమోత్సవవార్త భువనపఙ్క్తుల కెల్లన్.65
మ. తనతేజంబున నన్యతేజములు విధ్వంసంబు నొందించి యెం
     దును సన్మార్గము సుప్రకాశవిగళద్దోషంబుగాఁ జూపి య
     త్యనురక్తోజ్జ్వలమండలుం డగుచుఁ బూర్వాద్రీంద్రభద్రాసనం
     బున నొప్పెన్ గ్రహరాజు విశ్వము గరంబుల్ మోడ్చి సేవింపఁగన్.66
వ. ఇట్లు సూర్యోదయం బగుటయు వసుదేవసూనుండు కౌతుకోన్నీయమానుం
     డయి కృతకాల్యకరణీయుండును సముచితాలంకారుండును ననురూపజనపరి
     వేష్టితుండును ననురూపశుభచేష్టి శుంగ తుండును నగుచు రుక్మిణీదర్శనం బవే
     క్షింపుచుఁ దనయొక్కరథంబుతోడన శిబిరంబు వెలువడియె నంత వైదర్భుపురం
     బును జనపతిస్కంధావారంబును గుంకుమద్రవసేకంబుల ముక్తావిసరహారంబులం

  1. వెండి
  2. పడినఁ ద్రోచిపట్టుదు పాణిపంకజంబు