పుట:హరివంశము.pdf/338

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

290

హరివంశము

శ్రీకృష్ణుఁడు రుక్మిణీపరిణయార్థంబుగాఁ గుండిన పురంబునకు నరుగుట

వ. ఇట్లు వెడలి మహావిభవంబునం జని విదర్భవిషయంబు సొచ్చి నడచి నగరిఁ
     గదియు సమయంబున భీష్మకుం డాత్మీయబంధుసహితుం డై యతని నెదుర్కొని
     తోడ్కొని పోయి పురబహిరంగణంబున విడియించి యప్రమేయంబు లగు
     పూజాక్రమంబులఁ బ్రమదం బొదవునట్లుగా నారాధించె నారాజసమాజంబు
     లోని జనంబులు కొంద ఱితండు దనమేనయత్తకొడుకు పెండ్లికిం జనుదెంచెఁ
     దగున కాదె యనం గొందఱు గోవిందుండు మగధేంద్ర చేదిపతులదెస నప్రియుం
     డి ట్లేతెంచుటకుఁ గతం బేమియో యనుచుండఁ గొంద ఱయ్యిందువదన చందం
     బిమ్ముకుందునందు సంతుష్టసంకల్పం బని విందు మిది యె ట్లగునో యని
     యూహింప నఖిలయదువీరపరివృతుం డై యత్తెఱంగున వచ్చియున్న యాకృష్ణు
     నాకర్ణించి.52
ఉ. ఘోరనిదాఘదాహమునఁ గుందుచునున్న ధరిత్రి యుల్లస
     ద్వారిధరాంబుపూరపరివర్తనభద్రము సంభవించినన్
     భూరి రానుమోదభరమున్ భజియించువిధంబునన్ విప
     ద్భారము నుజ్జగించి వెసఁ బార్థివకన్యక ప్రీతచిత్త యై.53
వ. నిజాంతర్గతంబున.54
మ. నను దుఃఖాంబుధి నుద్ధరించుటకు నై నానాథుఁ డేతెంచె నిం
     కనుమానం బొకఁ డేల యెప్పుడొకొ యయ్యబ్జాయతాక్షు న్మహా
     ఘనవక్షుం దగఁ గాంతు ని ట్లిరిది భాగ్యం బబ్బునే నాకు నా
     జని సాఫల్యము నొందె సర్వజగదర్చ్యం బయ్యె నాకోర్కియున్.55
సీ. చూడ్కులు ననుఁ జెందఁ జొచ్చి గోవిందుడెందములోన నానందధన్య నగుదుఁ
     బలుకులజాడ తీపులు గ్రోలి సోలి గోవర్ధనునకుఁ జాలవలఁతి నగుదుఁ
     గ్రియలకుఁ బూఁచు కోర్కికి నెల్లదెసఁ జిక్కి శ్రీవత్సునకుఁ బ్రియశిష్య నగుదు
     నేర్పులు ప్రసరింప నెఱయుపాకము నొంది హరియం దభేదభావాత్మ నగుదు
తే. నానాప్రియంబును భక్తియు నాతలంపు, వలపుఁ గంసారి యెఱిఁగెడుకొలఁది యెఱిఁగి
     యఖిలజగములు నేన యత్యంతసుభగ, తానిరూఢితో నేలెడుదాన నగుదు.56
వ. అని యవ్యగ్రమనోరథపరిగ్రహంబుల నధికవ్యగ్ర యగు నాప్తసఖీజనంబులం
     గలసి కమలనాభుకల్యాణప్రసంగంబు లగుకథనంబులు వినోదంబు లయి క్రొత్తగా
     వెలయు నమ్మికం జేసి నెమ్మనం బూఱడి యుండి నిండువెన్నెలం బొలుపారు విభా
     వరియందు వినిద్రం బగుభద్రభావంబునం బ్రవర్ధిల్లె నాసమయంబున.57
క. మునురాకపోకలం దా, వనజానన వలపు దెలుప వలను గలుగు న
     త్యనురక్తజనులఁబ్రేమము, వినూతనము సేయఁ గరము వేడుకఁ బ్రభుఁడున్.58