పుట:హరివంశము.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

హరివంశము

     గనకదళీక్రముకస్తంభోన్నయనంబుల మరకతమకరతోరణబంధంబుల నమ్మహా
     నీలప్రాలంబమాలికాకలనంబులఁ బద్మరాగరమ్యధ్వజవైజయంతికావిరచనంబుల
     విచిత్రవిభవవిస్తారంబు లై శోభిల్లె నాసమయంబున.67
సీ. లాలితపర్జన్యలక్ష్మి విభూషించు [1]పర్యాప్తనవమేఘపంక్తు లనఁగ
     రమణీయశారదరాత్రిఁ బ్రకాశించు రాకాసుధాకరప్రభ లనంగ
     నుల్లసితాశోకవల్లరి నలరించు నుదితవసంతసంపద లనంగఁ
     బ్రకటితప్రాభాతపద్మినిఁ బాటించు బాలారుణోదయలీల లనఁగ
తే. వితతమోహనమంత్రదేవతఁ బ్రసన్న, జేయు సాధకసాధనశ్రీ లనంగ
     రుక్మిణీదేవి నభిరూపరుక్మకాంతి, కలితతనుయష్టి గైసేసి రెలమిఁ జెలులు.68
వ. ఇత్తెఱంగున సింగారించి యయ్యంగన లవ్వరాంగి నఖిలమంగళాధిదేవత యగు
     గౌరీదేవికి మ్రొక్కింపఁ దదీయదివ్యాయతనంబు గుఱించి కాంచనశిబికారూఢం
     జేసి తోడ్కొని పురంబు వెలుపలికిం జనుదెంచి రప్పు డచ్చట.69
తే. అలఘుయానావతీర్ణ యై యలరుఁబోఁడి, బోఁటిపదువులు పొదువంగఁ బొలుపు మిగుల
     దేవి దర్శించి తనముగ్ధభావ మధిక, [2]భక్తితాత్పర్యమున ననురక్తి నొప్ప.70
ఉ. అక్షతగంధపుష్పచయ మంజలి [3]నర్పణసేసి నమ్ర యై
     [4]యక్షయపుణ్యుఁ డుత్తముఁ డనంతయశోవిభవుండు పుండరీ
     కేక్షణుఁ డస్మదీయహృదయేశ్వరుఁ డయ్యెడుఁ దల్లి నీకృపా
     వీక్షణలీల నంచుఁ బ్రియ మింపెసలారఁగ మ్రొక్కె గ్రక్కునన్.71

పురంబువెలుపల గౌరీదేవిని సేవించి వచ్చు రుక్మిణీదేవిని శ్రీకృష్ణుండు గొనిపోవుట

క. గుడి వెడలెడునెడఁ గృష్ణుఁడు, కడుఁ గదియఁగ వచ్చి కాంచెఁ గామినిఁ దఱితోఁ
     బొడమి సుధాజడనిధి య, ప్పుడ వెలువడి యున్నకమలఁ బోలెడుపొలఁతిన్.72
చ. కని పరమేష్ఠి చేసినజగత్త్రయసర్గమునందు నివ్విధం
     బునఁ బొలుపారునద్భుతపుమూర్తులు గల్లెనె దీని విన్నయ
     వ్వినుకలి యెట్టులైన నొకవెంట సహించితి నింక నెట్లు నా
     మనసున కోర్వవచ్చు నసమానవిలోకనరాగవేగమున్.73
సీ. మెలఁగి పైకొని చూడ్కి [5]దలఁకంగఁ గ్రాలెడు దుఱఁగలితొలుకారుమెఱుఁగువోలె
     నురియాడుచిత్తంబు నెరియింపఁ దొడఁగెడు నాలోలపావకజ్వాలవోలె
     భావించి మఱుపునఁ బనుపడుబుద్ధికిఁ దనుపుసూపెడు సుధాధారవోలె
     బహువిలాపంబుల బ్రమయుచైతన్యంబు మరులు గొల్పెడు తీవ్రమాయవోలె
తే. బెనఁగి మరగినకోర్కులఁ బ్రిదులనీక, యాఁగి నిలిపెడు నలఘుదివ్యాజ్ఞవోలెఁ
     దరుణి యింతలోనన నన్నుఁ దనకుఁ దక్క, పిలిచికొనియె నిజాకారకలన నిట్లు.

  1. పర్యాయ
  2. భక్తికరముగ ననురక్తిభావ మొప్ప
  3. నర్చన
  4. యక్షతపుణ్యుఁ డుత్తముఁ డనంతుఁ డనంతయశుండు
  5. దలఁగక, దలఁగఁగ.