పుట:హరివంశము.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 2.

281

క. హరిచే నభిపూజితుఁడై, సురవర్ధకి దివికి నేఁగి సురపతి కాత్మా
     చరణం బెఱిఁగించి తదా, దరమున నత్యంతధన్యతముఁ డై యుండెన్.168
వ. ఇక్కడఁ గమలనాభుం డొక్కనిశాసమయంబున నిజజనకుమందిరంబునం దుండి
     యంతర్గతంబున.169
చ. తలఁచినయట్ల యెంతయు నుదాత్తతరం బగు [1]నాస్పదంబు పెం
     పలరఁగ నిట్లు నాదగుజనావళికిన్ సమ[2]కూరె నింక ను
     జ్జ్వలభవార్థసంపదల సంభరితం బగుజీవనంబు వీ
     రల కొడఁగూర్తు నాదయినప్రాభవ మప్రతిమాన మై చనన్.170
వ. అని యూహించి శంఖనిధి నాహ్వానంబు చేసిన నది యాక్షణంబ నిజరూపంబుతో
     నేతెంచి యద్దేవుముందటఁ బ్రాంజలి యై నిలిచి.171
క. పని యేమి కరుణతో ననుఁ, బనుపుము యదునాథ భువనబాంధవ నీ నె
     మ్మనమునకు మెచ్చు పుట్టఁగ, నొనరించెద ననినఁ బ్రియరసోత్కటుఁ డగుచున్.172
వ. దేవకీనందనుం డన్నిధానదేవతం గనుంగొని.173
ఉ. ద్వారకలోనఁ గల్గుజనవర్గము లెల్లెడ సౌఖ్యపూరితా
     గారములై యెలర్ప నిజగౌరవముం [3]బచరింపు మేను నా
     వారలయందు దీనుఁ గృశవైభవు సౌఖ్యవిహీనుఁ జూడఁగా
     నేర దరిద్రుఁడున్ మృతుఁడు [4]నిక్కము తుల్యుల కారె ధారుణిన్.174
తే. లేదు పెట్టవే యనుచును లేబరంపుఁ, బలుకు దనప్రజలో వినఁబడియె నేని
     నింతకంటె మిక్కిలి ధరణీశ్వరులకు, నెద్ది యవమాన మది మాన్పు మిపుడు నీవు.175
చ. అనుడు [5]మహాప్రసాద మని యన్నిధి యప్పుడ యేఁగి తోడియ
     య్యెనిమిదిపెన్నిధానముల కిం పెసలారఁగ దేవదేవుశా
     సన మెఱిఁగించి వైశ్రవణుసమ్మతితోఁ జనుదెంచి విస్ఫుర
     త్కనకపురాసు లై [6]యెసఁగెఁ గంసవిమర్దనుపట్టణంబునన్.176
ఉ. ఎక్కడఁ జూచినన్ సిరికి నిష్టవిహారపథంబుగాఁ గరం
     బక్కజ మైన సంపదల నందిరి తత్పురవాసు లెల్ల నే
     చక్కటి నిర్ధనత్వ మనుశబ్దము [7]లోనుగ మానె లోకము
     ల్మిక్కిలి మెచ్చ నయ్యనుపమేయచరిత్రుని చిత్రకృత్యముల్.177

శ్రీకృష్ణుడు వాయుదేవునిచేత సుధర్మయను దేవసభ ద్వారకకుఁ దెప్పించుట

వ. అమ్మహాతుండు మఱియు నొక్కతఱిఁ దండ్రియింటికడన యుండి యేకాంతం
     బునం దలంచి వాయుదేవు రావించి ప్రణతుం డగునతని నాలోకించి యి ట్లనియె.178

  1. నాలయంబు
  2. కూర్చితింక
  3. బ్రసరించు
  4. నిక్కమ
  5. అనిన
  6. యెలసె
  7. లారఁగ, లూనఁగ.