పుట:హరివంశము.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

హరివంశము

     వ్వరు సరి సర్వశిల్పవిభవంబునయందు సమర్ధమెందున
     చ్చెరువు భవత్ప్రభావము ప్రసిద్ధము గాదె సురేంద్రపూజితా.160
వ. అట్లు గావున.161
శా. నామాహాత్మ్యనిరూఢి కెంతయుఁ దగ న్నాకంబునం దింద్రువీ
     డేమై నొప్పగు నట్లు భూతలమునం దెల్లం బ్రకాశిల్ల మ
     త్సామర్థ్యంబునకుం ద్రిలోకములు నాశ్చర్యంబు నొందంగ ని
     చ్చో [1]మాకొక్కపురం బొనర్పుము కళాసూత్రంబు చిత్రంబుగన్.162
చ. అనవుడు నాతఁ డిట్లను మహాత్మ భవత్ప్రియ మెట్టు లట్ల యే
     ననుపమశిల్పకల్పన మనర్ఘ్యముగాఁ [2]బచరింప నోపుదు
     న్విను మిటు లున్నయీజనుల [3]విప్పు గనుంగొన వచ్చినం బురం
     బున కిచ టిమ్ము చాల దనుబుద్ధి జనించె గణించి చూడుమా.163
తే. జలధి యొక్కింత యెడయిచ్చి చనియెనేని, సర్వలోకాతిశాయిగా సంఘటింప
     వచ్చుఁ బట్టణ మన విని వాసుదేవుఁ, డట్ల కాకని యాప్రొద్ద యధికనియతి.164
వ. ఆసరిన్నాథుఁ బ్రార్థించినం దతార్థనానురూపంబుగా నతం డతిబహుళపవనో
     ద్ధూతసలిలుం డై నలుదెసలం బండ్రెండుయోజనంబులు గలుగ నెడయిచ్చి
     పోయిన నవ్వారిజేక్షణునకు నవ్వారిరాశి చేసిన సత్కారంబునకుం బ్రియం
     బందుచు [4]బృందారకవర్ధకి గోవర్ధనధరుచేత ననుజ్ఞాతుం డై యప్పుడ నిజవిద్యా
     ప్రభావంబున.165
సీ. కనకంపుపెనుగోట వినువీథి గడవంగ మణిగోపురములు సమగ్రములుగ
     బంధురప్రాసాదపఙ్క్తులు నుత్తుంగహర్మ్యరేఖలు మనోహరత నలర
     రాజమార్గం బభిగ్రామంబుగాఁ బణ్యపదము లుజ్జ్వలశిల్పభంగి నమర
     నమరసద్మములుఁ జైత్యంబులు సభలును బ్రపలు నపూర్వంపురచన మెఱయఁ
తే. దోరణాట్టాల[5]కంబులు తోరములుగఁ, గూపదీర్ఘికాసరసులు కొమరు మిగులఁ
     గృతకపర్వతోద్యానంబు లతులములుగ, బరగుపురము నిర్మించె నచ్చెరువు గాఁగ.166
వ. ఇట్లు విశ్వకర్మచేత మానససృష్టి నుత్పాదిత యై ద్వారావతి యన మున్న
     యన్నారాయణుచేత నాకారిత యై రమ్యాకార యగునమ్మహాపురి నభినవానేక
     విచిత్రరచనాచతురం బగు రాజమందిరంబు నయ్యాదవేంద్రుం డధిష్ఠింప నఖిల
     యాదవులు నుచితస్థానంబులు గైకొని నిలువం బ్రభూత[6]హస్త్యశ్వరథసంకీ
     ర్ణయుఁ బ్రసిద్ధనరనారీ(సం)చరణ[7]శోభినియుఁ బ్రకృష్టకల్యాణక్రియాకల్యయుఁ
     బ్రవృద్ధసంపక్సంపూర్తికలితయు నై శరత్సమయసముదితేందుతారక యగుగగన
     వీథియు వసంతవిభవవిస్ఫుటోల్లాస యగు నుద్యానభూమియు జలదసమాగమో
     త్తుంగతరంగసలిల యగు సలిలాశయశ్రీయును నుపమానపాత్రంబులుగా నుల్ల
     సిల్లెఁ దదనంతరంబ.167

  1. మాకు న్నగరం
  2. బ్రసరింపు
  3. వేగఁ గడుం బరికించినం
  4. దేవ
  5. కేతువుల్
  6. గజతురగ
  7. శోభిత