పుట:హరివంశము.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

హరివంశము

     బూనెద మేము లేకునికి పొల్పుగఁ గాంచి యతండు సేనయుం
     దానును గోట[1]ముట్టడము దక్కి వెసం జనుదెంచు మాబడిన్.25
తే. [2]వినుము విజయంబు గోరెడుమనుజవిభులు
     తమకుఁ బ్రతివీరుఁ డైనశాత్రవుఁడు దప్పి
     చనిన నతనిన కాని తజ్జనులఁ దొడర
     నొల్ల రఫలంపుఁ [3]బెనఁకువ యొప్ప కునికి.26

రామదామోదరులు మధురాపురంబు విడిచి జరాసంధుఁడు వెనుకొన దొలంగిపోవుట

వ. ఇట్టియుపాయంబున నేము నీ చెప్పిన వింధ్యాదిమహీధరంబుల మీఁదటిదుర్గం
     బులు గైకొని బలసి మగధపతి వచ్చినను లావు మెఱసి కయ్యంబు సేసెదము
     శాత్రవుండును జిత్రగహనాంతరంబులం జేయునది లేక చిక్కువడంగలవాఁడు
     నామతంబునఁ బురజవంబులుఁ గులంబువారును రాష్ట్రనివాసులు నలజడింబడక
     బ్రతికెద రనిన నివ్విధంబునకు నఖిలయాదవులు నియ్యకొనిన బలరామ
     దామోదరులు నిరాయుధహస్తు లై పురంబు నిర్గమించి యశంకితమతి నజ్జరా
     సంధుపాలికిం జని సమ్ముఖంబున నిలిచి.27
క. నానాదేశంబుల బలు, మానుసులం గూర్చి నీవు మగధేశ్వర యే
     పూనిక నిటవచ్చితి చెపు, మా నిక్కము నిర్వహింతు మప్పని యేమున్.28
చ. అనుటయు నన్నరేంద్రుడు మహాబలవంతులు గాఁగ నిద్దఱన్
     విని మిము నాజిలోఁ దొడరి విక్రమశౌండత సూపు టొక్కఁడుం
     బనియుఁగ నేను వచ్చితిని బద్ధసముద్యములై కడంగుఁ డిం
     క నిహతశత్రుఁడై మరలుఁగాక జరాసుతుఁ డూర కేగునే.29
క. అని పలికి సముద్ధతిఁ బటు, ధనువు రయం బెసఁగఁ గొని శితప్రదరంబుల్
     నినిచిన నిషంగ[4]యుగ్మం, బనువుగ ధరియించి కవచితాంగం బమరన్.30
వ. నిలిచిననయ్యోధపుంగవుం గనుంగొని సంభ్రమం బేమియు లేక తొలంగి
     యయ్యదుకుమారులు సమదమాతంగసమగమనంబున దక్షిణాభిముఖు లై చనం
     దొడంగి రిట్లు చని రాష్ట్రంబులు పురంబులుఁ బెక్కులు గడచి వింధ్యాటవీభాగంబు
     దఱిసి ఋక్షవత్కాననాంతరంబుల మెలంగి యట సహ్యశైలంబునడవులు
     సొచ్చి యందు.31
మహాస్రగ్ధర. కని రాపాతాళమూలక్షతశిఖరిశిఖాకల్పితోత్తుంగతీర
     ధ్వనితో[5]త్పన్నానుబద్ధోద్ధతబహులహరీదర్శనీయప్రవాహన్
     వనహస్తిధ్వస్తశాఖివ్రజగహనమహావ ప్రసంప్రాప్తభేద
     స్వన [6]దంతర్వాశ్శకుంతన్ వరతటినిఁ బటువ్యాప్తనిర్వేణ్యవేణ్యన్.32

  1. ముట్టడువు, ముట్టిడిపు.
  2. వినుఁడు
  3. దేఁకువ
  4. యుగళం
  5. చ్చేనాను
  6. నంత