పుట:హరివంశము.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హరివంశము

ఉత్తరభాగము - ప్రథమాశ్వాసము

     పరిణతభుజవైభవ
     గోపాయితభువనజగదగోపాల ధరి
     త్రీపాలన నుతసద్గుణ
     నైపుణ [1]ధౌరేయ ధీర నాయకవేమా.1
వ. అక్కథకుండు శౌనకాదిమహామునులకుం జెప్పె నట్లు మధుమధనండు మధురా
     పురంబున మధురం బగురాజభారంబు గైకొని గోకులనివాసవ్యాసంగం బంత
     రంగంబునకు వింతయై తోఁప నింపారుస్నేహబంధబంధురప్రవర్తనంబు కీర్తనీ
     యంబుగా నుల్లసిల్లె నాసమయంబున.2
ఉ. సింధురవైరిశౌర్యుఁడు ప్రసిద్ధయశః[2]పటికావృతాష్టది
     క్సింధురవక్త్రుఁ డిద్ధరణకృత్యుఁడు రాజగృహేశుఁ డాజరా
     సంధుఁ డరాతిరాజపరిషత్పరిసేవిత[3]బంధనుండు గ
     ర్వాంధుఁ డవంధ్యరోష[4]కుసుమాన్వితదర్ప మహీరుహుం డిలన్.3
వ. ఆస్తిప్రాస్తినామధేయ లయిన కంసభార్య లిద్దఱుఁ దనకూఁతులు గావున వారికి
     నైనవైధవ్యదైన్యంబు నత్యంతదుస్సహం బగుటయుఁ గృష్ణుపరాక్రమంబు
     సహింపక సర్వసర్వంసహాచక్రంబునం బరఁగు రాజుల నందఱం గూర్చి యిరువది
     యొక్క యక్షౌహిణులసంఖ్య గల సైన్యంబులతోడ మధురపై నెత్తి చనుదెంచి
     యమునాతీరంబున విడిసి.4

జరాసంధుఁడు మధురపై దండెత్తివచ్చి కృష్ణునొద్దకు దూతలఁ బంపుట

క. విందానువిందు లనఁగా, నెందును బేర్కనినవారి నిరువుర భూభృ
     న్నందనుల నవంతీశుల, నొందఁగ దూతలుగఁ గృష్ణునొద్దకుఁ బనిచెన్.5
వ. పనుచుటయు వారు నరుగుదెంచి యదుసభామధ్యంబున మహనీయనృపాసనా
     సీనుం డై యున్న యుగ్రసేనుం గని తత్పార్శ్వంబున బలభద్రసహితంబుగా
     నుచితపీఠోపరిదేశంబునఁ బొలుపారు పురుషోత్తముం గాంచి యి ట్లనిరి.6
మ. జననాథాగ్రణి సత్యసంధుఁడు జరాసంధుండు గోవింద ని
     న్ననుమానింపక యాడు మన్నతెఱఁ గే మారాజువాక్యంబుగా
     నొనరం బల్కెద మల్క లేక వినుమా యొక్కింత యీయుగ్రసే
     ననరేంద్రుండును సర్వయాదవవితానంబు వినం బెంపునన్.7

  1. ధౌరీణ
  2. స్ఫటికా
  3. బంధుఁడార్యగ
  4. కుసుమార్చితదర్పహితాహితుం డిలన్