పుట:హరివంశము.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

హరివంశము

క. ఇరుగెలఁకుల మణికాంచన, విరచితహర్మ్యముల నుండి వెలఁదులు ప్రీతిం
     బురుషోత్తముఁ జూచిరి వి, స్ఫురితకుతూహలము లుల్లములఁ దళుకొత్తన్.221
తే. కామినీనేత్రరోచులు గడళులొత్తి, వెల్లువై మీఁదఁ గవియంగ విభుఁడు మెఱసె
     మరగి బృందావనంబునఁ దిరుగునాఁడు, యమునలో నీఁది యాడెడునట్ల పోలె.222
వ. అప్పు డప్పుణ్యాంగనాజనంబులు దమలోన.223
సీ. వ్రేతలు గరగగంగ వేడుకఁ బిల్లఁగ్రో లెనయఁ జేర్చినదె యీయనుఁగుమోవి
     మానంబు వీఁటిఁబో మసఁగి వ్రేతలఁ జిక్కువఱచినయదియె యీకఱటిచూపు
     నింపారువ్రేతల యీఁతకు మిక్కిలి లోఁతైనయదియె యీలేఁతనవ్వు
     వేలసంఖ్యలు గలవ్రేతలచనుదోయి బిగియనొత్తినదె యీపేరురంబు
తే. పూని యితని దేవర యనిరేనిఁ గాక, సోలి చక్కనివాఁ డని చూచిరేనిఁ
     గడఁగి తివుట లుల్లంబులఁ గ్రందుకొనఁగ, నెట్టి[1]యీలువుటాండ్రును నెగ్గుపడరె.224
వ. అనుచుండం బుండరీకాక్షుండు పూర్వజపూర్వకంబుగా వసుదేవుని సదనంబున
     కరిగి తల్లికిం దండ్రికి నమస్కరించి తదాశీర్వచనంబుల నభినందితుం డై విద్యా
     భ్యాసప్రకారంబు సకలంబును బంధుజనమధ్యంబున నెఱింగించి సుఖం బుండె నని
     జనమేజయజనపతికి వైశంపాయనమునివరుండు వివరించిన విష్ణుచరితాత్మకం బగు
     వాఙ్మయం బతిప్రవ్యక్తంబుగ.225
మ. [2]చరితానేకసమీకసాగర సమస్తక్షాత్రజైత్రోద్యమ
     త్వరితానేకరథాశ్వహస్తిసుభటోద్యత్సైన్య దైన్యక్రమా
     చరితానేకసమర్థపార్థివమహాసౌహార్ధనిర్దోషతా
     స్ఫురితానేకగుణౌఘనిర్మలయశఃప్రోత్ఫుల్లదిఙ్మండలా.226
క. నారీరమణరమాత్మజ, నారాయణసదృశ వీరనారాయణ నా
     నారణనర్తితనారద, నారాచక్షుభ్యదన్యసంవరసైన్యా.227
మాలిని. అహితజనకఠోరా యన్నమాంబాకుమారా
     విహితధరణిరక్షా వీరశృంగారదక్షా
     మహితసుజనలోకా మాననీయప్రతీకా
     రహితదురితసంగా రాయవేశ్యాభుజంగా.228
గద్యము. ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానందసౌందర్య
     ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
     ప్రణీతం బైన హరివంశంబునం బూర్వభాగంబు సర్వంబు నవమాశ్వాసము.

  1. పొలఁతులు మరువైన సేవపడరె
  2. తరితానేకసమీరసాగర సమిద్ధక్షాత్ర