పుట:హరివంశము.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 9.

231

సీ. కంసభామినులయాక్రందనధ్వని వీను లందునఁ జిత్తంబునందుఁ గరుణ
     యంకురింపఁగఁ గృష్ణుఁ డఖిలయాదవులమధ్యమున నశ్రువులు నేత్రముల నించి
     యకట యే నధికబాల్యమున సైపక యిట్లు సదిభామినీసహస్రములఁ దీవ్ర
     వైధవ్యశోకదుర్వారవారిధిలోన ముంచితిఁ గంసుని మొఱకడములు
తే. దలఁవచ్చినఁ జంపక తొలఁగ వెవ్వఁ, డాత్మజనకుని నుగ్రబంధాభితప్తుఁ
     జేసి లోకులు నిందింప సిద్ధరాజ్య, విభవ [1]మొక్కఁడు గొన్నాఁడె వీఁడు దక్క.175
క. పాపిదెసఁ గరుణసేయుట, పాపం బని చెప్ప విందుఁ బ్రకటితధర్మ
     వ్యాపారుఁ డైనపురుషునిఁ, జేపట్టుదు రమరులును బ్రసిద్ధప్రీతిన్.176

ఉగ్రసేనుఁడు కంసునకు నగ్నిసంస్కారంబు సేయుటకుఁ గృష్ణుననుజ్ఞ నొందుట

వ. ధర్మహీనుం డగు నిద్దురాత్ము వధియించుట సర్వలోకసమ్మతంబుగా మున్న
     యెఱింగి ప్రవర్తించితి నిటమీఁదఁ గర్తవ్యం బెయ్యది గల దది యెల్ల నెఱుం
     గుదు నన్నియుఁ గొఱంతపడకుండ నిర్వహించెద నని పలుకుచుండ నుగ్రసేనుండు
     శిని ప్రభృతు లగు యదువృద్ధులు పొదివికొని చనుదేరం జనుదెంచి జనార్దను
     ముందట నవనతాననుం డై యశ్రులు దొఱుఁగఁ గొంతసేఁ పూరకుండి యనంత
     రంబ గద్గదకంఠుం డగుచు నతని కి ట్లనియె.177
సీ. అన్న కుమార నీయద్భుతక్రోధాగ్ని కాహుతిఁ జేసి తుగ్రారివీరు
     విక్రమఖ్యాతి వెలయించి తెందును దివ్యమాహాత్మ్యంబు దేటపఱిచి
     తహితసామంతుల నడలించి తఖిలయాదవవంశమునకు నుత్సవ మొనర్చి
     తార్యుల మిత్రుల నాత్మీయపక్షంబు గావించి తెసఁగితి గౌరవమున
తే. రాజ్య మింతయు నీసొమ్ము రాజ వీవు, గుడువఁ గట్టను బెట్టనుఁ గొఱఁత లేక
     యేనుఁగుల గుఱ్ఱముల నెక్కి యెల్లవారుఁ, గొలువ సాధురక్షకుఁడవై కొఱలు మింక.178
క. జితశాత్రవుఁడవు గావున, మతిలోఁ బగదలఁప కనఘ మాబోటులకున్
     గతివై యార్తశరణ్యుం, డితఁ డనఁగా నునికి నీకు నెంతయు నొప్పున్.179
వ. భవదీయక్రోధాగ్నిదగ్ధుం డైన కంసునకుం బ్రేతకార్యం బిప్పుడు కర్తవ్యంబు
     నీవు దీనికి ననుజ్ఞ యిచ్చి పనిచిన నాలుగోడండ్రు, నేను నవ్విధంబు నడపి తోయ
     ప్రదానమాత్రంబు సేసి ఋణమోక్షణంబు నొందెద నటమీఁద జటావల్కలా
     జినధారణం బొనర్చి కాఱడవి సొచ్చి మృగంబులకు నెచ్చెలినై చరింపంగల
     వాఁడ నిదియ నిశ్చయం బనిన విని గోవిందుండు.180
తే. అధిప నీ వింత న న్నిప్పు డడుగ నేల, కాని కార్యంబు సెప్పెద పూని నీవు
     కంసునికిఁ బశ్చిమాధ్వరకార్యసరణు, లకట నడపంగ వలదంటినయ్య యేను.181
వ. ఇంక నొక్కటి యుగ్గడించెదఁ జిత్తగింపుము.182

  1. విభవముఁ గొనువాఁడు గలఁడె.