పుట:హరివంశము.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

232

హరివంశము

సీ. రాజ్యంబు పనిలేదు రాజధనంబుపై నాసయుఁ జొరదు నాయాత్మఁ గంసుఁ
     దునుముటయును నర్థదోహలంబునఁ గాదు వంశపాంసనుఁడును వసుధ కెల్లఁ
     గంటకుండును గాన గ్రక్కున నాతని నిట్లు సేసితి లోకహితము గోరి
     యెవ్వారలకు లేని యెసకంపుఁగీర్తి శాశ్వత మయ్యె నింతియ చాలు నాకు
తే. నింక నెప్పటియట్టుల యేను బోయి, యాలకదుపులలోన గోపాలకోటిఁ
     గూడి యాడుచు నట వన్యకుంజరంబు, రీతిఁ గోరినట్టుల విహరించువాఁడ.183
క. మది నది వేఱొకతెఱఁగై, యెదిరికి మెచ్చినదిగాఁగ నిట్లాడుటఁ గా
     దుదితయశా నీవొక్కటి, మదీయవిజ్ఞాపనక్రమము విను మింకన్.184
శా. నీసౌమ్మై పెనుపొందు రాజ్యము దగ న్నీ కీక నీచాత్ముఁ డై
     నీసూనుం డెడ నాక్రమించికొనియె న్నిర్వ్యాజభంగిం దుదిన్
     దోసం బేమియు లేక యంతయును నిన్నుం జేరెఁ గైకొ మ్మనా
     యాసప్రక్రియ నిఫ్డు పొందు మభిషేకానందకల్యాణమున్.185
తే. ఏను గెలిచిన సిరి నీకు నిచ్చుచున్న, వాఁడ నామీఁదఁ బ్రియమును వత్సలతయుఁ
     గలిగెనేనిఁ ద్రోవక చేయవలయు నాదు, ప్రార్థనంబు సర్వాన్వయప్రభుఁడ వీవు.186
క. అనుటయు నుత్తర మేమియు, నన కతిలజ్జావినమ్ర మగువదనముతోఁ
     బెను పమర నున్నయాతని, ననఘుం డాక్షణమ సర్వయదుమధ్యమునన్.187
వ. భద్రాసనంబున నునిచి సముచితంబుగ నభిషేకించె నివ్విధంబున నభిషిక్తుం డై
     యనంతరంబ యయ్యుగ్రసేనుండు.188
చ. హరియును సర్వబాంధవులు నర్హపురోహితభూసురేంద్రులుం
     బురజనులున్ సమేతులుగఁ బుత్రుల కిద్దఱకున్ సమస్తసం
     స్కరణములన్ యథోక్తములుగా నొనరించి కృతార్థుఁడయ్యె ని
     ప్పరుసునఁ గంసుఁ డొందెఁ బితృభావితలోకము నాత్తసత్క్రియన్.189
వ. వాసుదేవుండును నుగ్రసేను రాజుం జేసి సర్వరాజ్యంబునకుం బ్రవర్తకుండు
     దానై యఖిలనియోగంబులు (నభియోగంబులు)గాఁ బ్రయోగించి మధురా
     పురంబు తొల్లింటికంటెను విభవబంధురంబుఁ గావించి ముదంబున నుండి
     యొక్కనాఁ డగ్రజుతో విచారించి.190
మ. జననం బాదిగ నాలలోఁ బెరిగి సంస్కారంబు నాచారమున్
     ఘనవిద్యాగ్రహణంబు లేక యడవిం గారెర్కుచందంబునన్
     జనఁగాఁ గాలము వోయె నింక వలదే సమ్యగ్గురూపాసనం
     బున నాసర్వము గైకొనంగ నియమాభ్యుత్సాహసంపన్నతన్.191
వ. అవ్విధంబు బంధుజనంబుల కెఱింగించి యిద్దఱుం గూడి యవంతిపురనివాసి యై
     యున్న కాశ్యపుం డగు సాందీపనుం డను మహాద్విజునిపాలికిం జని యాత్మీయంబు