పుట:హరివంశము.pdf/235

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 7

187


క.

ఆలం గాచెద వక్కట, త్రైలోక్యముఁ బేర్మిఁ గావఁ దగువాఁడవు నీ
మూల మెఱుంగమి వెఱఁ గడుఁ, దూలెద మి ట్లేమితప్పు దొడరునొ యనుచున్.

236


తే.

నందగోపునియన్వయానందకరుఁడు, సుదతి యాయశోదకు ముద్దుసూపుపట్టి
క్రీడ సలిపెడు నదె చిన్నికృష్ణుఁ డనుచు,మనుజుఁగా నిన్నుఁ గనుతప్పు మాకు సైపు.

237


క.

నీ వెవ్వఁడవైన నగుము, భావంబున నీకు మ్రొక్కి బ్రతికెదము మమున్
గావుము ప్రోవుము గొల్లల, మేవిధిఁ [1]బేరుకొనువార మెఱుఁగ మొకటియున్.

238


తే.

అనిన నవ్వుచు వారితో నవ్విభుండు, మీకు నిన్ని ద్రవ్వఁగ నేల మిన్నకున్నఁ
బోదె మీబాంధవుఁడ ననుబుద్ధి చాలు
[2]నవల నేమి సేసెదరు మీ రనఘులార.

239


శా.

కీ డొక్కింతయుఁ జెందనీక ప్రియము ల్గీల్కొల్పుచున్ వచ్చెదం
గ్రీడాలోలత నాకు నేయది యపేక్షింపంగఁ బట్టై ననుం
జూడుం డూరక యొయ్యఁ గాలగతి నా చొప్పెల్లఁ దెల్లం బగున్
మీడెందంబుల కవ్విధం బతిశుభోన్మేషావహం బయ్యెడున్.

240


వ.

అనిన సంతసిల్లి వల్లవు లందఱుఁ దమతమమందిరంబులకుం జని సుఖసంచారం
బులం బ్రవరిల్లి రని జనమేజయునకు వైశంపాయనకధితం బైన కథాప్రపం
చంబు సమంచితవ్యాఖ్యానవిఖ్యాతంబుగ.

241


ఉ.

సంగడిరక్షపాలబహుసంగరజీత్కరవాల బాలికా
మంగళమూర్తిహేల యసమానసమంజసకీర్తినర్తకీ
రంగదిగంతరాళ గుణరాజిహృతాఖిలచిత్తజాల స
ప్తాంగరమావిశాల సకలార్థివిచక్షణపుణ్యలక్షణా.

242


క.

చెంజిమలచూరకార ధ, నంజయసమసత్త్వజైత్ర నమదరిచూడా
సంజనమనోజ్ఞనఖరుచి, కింజల్కసరోజసదృశఖేలనచరణా.

243


మాలిని.

అసకృదసమధాటీ వ్యాప్తిదృప్తాగ్రయాయీ
ప్రసభజనితవిద్విట్పట్టణోద్ధాహవేగో
ల్లసితవిచలదుల్కాలంఘికధ్వాంతవాసీ
వ్యసనవిశదలీలావర్ధమానప్రతాపా.

244


గద్యము.

ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వర చరణసరోరుహ ధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన హరివంశంబునం బూర్వభాగంబునందు సప్తమాశ్వాసము.

  1. గాఁ దిరుగు
  2. వాపలేమి