పుట:హరివంశము.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

హరివంశము


శా.

మా మేనత్తతనూజు లేవురును సన్మాన్యు ల్మహావిక్రమ
శ్రీమంతు ల్డివిజాంశసంభవులు వర్ధిష్ణుల్ కురూత్తంసముల్
సామర్థ్యంబున నీ[1]సమస్తధరయు సాధింతు రం దాభుజ
స్థేమాకల్పుఁడు మధ్యముండు త్రిజగజ్జిష్ణుండు శౌర్యోన్నతిన్.

225


ఉ.

ఏ నిదియంతయున్ సురగణేశ్వర మున్న యెఱుంగుదున్ మదిన్
బూని రణాంతరంబునఁ బ్రభూతజయావహ యైనబుద్ధి న
మ్మానవసింహు శోభనసమగ్రునిఁ గాఁగఁ దలంచినాఁడ ని
చ్చో నిటు నీవుఁ జెప్పి తటసూడు మవశ్యము నట్ల చేయుదున్.

226


వ.

భవదీయసమాగమనసౌహార్దంబునకు హర్షించితి నింక నిష్కళంకచిత్తుండ వై
యుత్తమస్థితిం బ్రమోదింపు మని వీడ్కొలిపినం బాకశాసనుం డయ్యసురశాసను
చరణసరసీరుహంబులకుఁ బ్రణమిల్లి ప్రదక్షిణంబు సేసి యెప్పటియట్ల యైరా
వతంబు నెక్కి, సురలు పరివేష్టింప నాత్మీయస్థానంబునకుం జనియె నంత నిక్కడ.

227

గోపవృద్ధులు శ్రీకృష్ణుని మహాప్రభావం బభివర్ణించి యతని నరయుట

క.

ఆగోవర్ధనగిరితట, భాగంబున నుండి భువనబాంధవుఁడు మహా
భాగుఁడు వ్రేపల్లెకు నను, రాగంబున నరిగె సఖపరంపరతోడన్.

228


వ.

ఇట్టి వాసుదేవప్రభావం బఖిలంబు ననుసంధించి.

229


ఉ.

అందుల వృద్ధులున్ మతిసమగ్రులుఁ గార్యవిచారవేదులుం
గ్రందుకొనంగ నాతని నఖర్వచరిత్రునిఁ గాంచి చుట్టు నా
నందసమగ్రులై బలసి నవ్యవికాసవినీతిసంభ్రమ
స్పందనముల్ నిజంబు లగుభావములుం జెలఁగంగ నత్తఱిన్.

230


వ.

అత్యంతగంభీరప్రకారంబున నక్కుమారున కి ట్లనిరి.

231


శా.

గోత్రోద్ధారణకేళి నశ్రమమునన్ గోత్రాపరిత్రాణముం
జిత్రప్రౌఢి నొనర్చి తివ్విధములున్ జెప్పంగఁ జూపంగ నీ
గోత్రామండలి నెందుఁ గల్గునె వెఱన్ గోవింద నీ కమ్మెయిన్
గోత్రారాతియు నమ్రుండై యొదుగఁడే గోపాలురే యీదృశుల్.

232


తే.

ఇట్టినీవు సుట్టంబవై యింతవట్టు, వారిలో నున్నవాఁడవు వారిజాక్ష
యేము ధన్యాత్ములము మమ్ము నెవ్వ రెనయు, వారు మా[2]కోర్కు లెల్ల నిండారఁబండె.

233


క.

వెఱచి వెఱచి యడిగెద మే, మెఱిఁగింపఁగ వలయు నొకటి యీ వెవ్వఁడ వీ
కొఱమాలినగొల్లతనము, మఱువున విహరించె దిట్లు మహి నాత్మేచ్ఛన్.

234


క.

వసువులలో రుద్రులలో, శ్వసనులలో నొక్కఁడనొ నిజం బెయ్యది రా
క్షసయక్షఖచరగంధ, ర్వసిద్ధవిద్యాధరప్రవరజన్ముఁడవో.

235
  1. యశేష
  2. కోర్కిగములు