పుట:హరివంశము.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 6

141


గైసేయం దగి ఫుల్లమల్లికలికాగర్వాంధమై పర్వె స
ర్వాసహ్యోర్ధతి యయ్యె ధర్మసమయం బారంభసంసేవ్యమై.

32


క.

మడువులనీ రింకించుచు, నెడపడఁజేయుచుఁ బ్రవాహ మెట్టిది యైనన్
వడ యొయ్యనఁ బేర్చుచు ను, గ్గడువయ్యె నిదాఘబలము క్రమయోగమునన్.

33


మ.

హరి యంభోనిధి సొచ్చె శంభుఁడు తుషారాద్రీంద్రముం బ్రాఁకె వా
గ్వరుఁ డుద్యన్మకరందదుర్దినసమగ్రం బైనయుత్ఫుల్లపం
కరుహంబున్ భజియించె దీని మును గల్గం గాంచియే కాక యె
వ్వరి నిం కేల సహించు గ్రీష్మ మనఁగా వర్ధిల్లెఁ దాపోద్ధతుల్.

34


సీ.

వనధు లెల్లను గ్రోలి తనియక పెనుపొంది బడబాగ్ని యంతటఁ బ్రబ్బె నొకొ
యాగంగఁ గొలఁదిగా కభవుండు [1]గ్రక్కినఁ గ్రమజుఁ గరళాన్ని కడఁగా నొక్కొ
నీరజాసనునోరు నిండకమున్న కల్పాంతాగ్ని దమకించి యడరె కొక్కొ
సకలతత్వంబు[2]ల సమయించి ఘోరాగ్ని తత్త్వ మొక్కటియ కాఁ దలఁచె నొక్కొ


తే.

యగ్నియును మారుతంబు ననాదియైన, మైత్రి నేఁడ కాఁజూపంగ మసఁగె నొక్కొ
కాక యిట్టి వేసవి యెందుఁ గలదె యనుచు, జనులు బెగడొంచ గాడ్పుతో జఱచె నెండ.

35


మ.

తమలో రాయిడిగొన్నయున్నతుల సద్వంశంబులున్ రూపఱున్
సమయించుం దమయాశ్రితావళిని నెన్నంగా నిజం బిట్టిభా
వము సూడుం డనునట్లు వేసవి మహావంశాటవుల్ రాసి ద
గ్ధము లయ్యె న్నికటద్రుమానలులతోఁ గ్రందంగఁ దావాగ్నులన్.

36


క.

తరు లెల్ల గ్రల్లవడఁగా, విరళములై వీథులున్న విధ మొప్పె నహ
స్కరరుచులతోడఁ దలపడి, యరుదుగఁ బోరాడి. తుమురులై పడినక్రియన్.

37


మ.

జ్వలితారణ్యకధూమముల్ శిఖిశిఖాసక్తిం దటిల్లీలతోఁ
గలయం గ్రమ్ముఘనాళిభంగి నెసఁగంగా నెండమావుల్ దిశా
వలయాపూరజలంబులన్ దొరయఁగా వర్షాగమస్ఫూర్తియై
వెలసెన్ గ్రీష్మము తీవ్రతాపము కడున్ భిన్నప్రకారంబుగాన్.

38


తే.

పక్వఫలములఁ గ్రాలుకింపాకలతల, బెరసి వేసవి చే పడి తరువులెల్ల
దావదహనసంయుక్తికిఁ దప్పె నవియు, నలఁగి దావాగ్ని నొదివినయట్ల యుండె.

39


శా.

గోపూర్ణ[3]స్తనదుగ్ధపానవిధులున్ గోవర్ధనాంతర్ఝరీ
వ్యాపారంబులు గోపతిప్రియసుతావాఃకేళిలీలాస్ఫుర
ద్గోపీ[4]ముగ్ధకుచోపగూహనములున్ గోవిందసాంగత్యమున్
గోపశ్రేణికిఁ బాపెఁ దాపభయమున్ ఘోరంపుఘర్మంబునన్.

40


వ.

ఇట్టి నిదాఘకాలం బతిక్రాంతం బగుకొలంది నొక్క కారణంబున.

41
  1. మ్రింగిన గరళాగ్ని గ్రమ్మటఁ గ్రక్కె నొక్కొ
  2. లు జాలించి
  3. స్రవ
  4. పీన