పుట:హరివంశము.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

హరివంశము


వ.

అని మఱియుఁ బెక్కుభంగులయెలుంగుల నొక్కకోలాహలం బెసంగ మంద
యంతయు నొక్కపెట్ట కదలి లావుమానుసులు కదుపులం గొని ముందరం
బోవఁ బిఱుంద బండ్లును బండ్లజాడం దక్కిన ప్రజయును నడువం దరుణతరుణీ
జనంబు లొండొరుల తోడిమేలంపుటాలాపంబులం బ్రమోదకరంబు లగువినో
దంబుల నదటుమీఱి కడచి చనం బంగ్వంధజఠరప్రముఖులు గ్రుస్సి యోలాకు
పడ నెడనెడం గావలియై తగువారు నడపింప నవ్విధంబునం జని బృందావనంబు
ప్రవేశించి యుచితప్రదేశంబులు నివేశంబులుగా నిరూపించి గోపాలముఖ్యులు
నిలువ నాక్షణంబ.

23


క.

ఒకయామఱ పట పిది యని, సకలజనము చూడ నర్ధచంద్రాకృతియై
శకటావళి విడియఁగఁ గడు, వికటస్థితి నెల్లవారు విడిసిరి గలయన్.

24


వ.

అంత.

25


చ.

[1]గుడిసెలు వన్నియున్ ఘననికుంజము లిండులుగాఁగఁ జొచ్చియున్
బెడఁగగుజొంపము ల్గలిగి పేర్చినమ్రఁకులక్రింద నుండియుం
గడఁక యెలర్ప [2]బొడ్లకును గ్రంపలు వైచియు నొక్కనాఁటిలో
నడరఁగఁ బ్రాతకాపు లయి రక్కడ గోపకుటుంబు లందఱున్.

26


శా.

శృంగారంబులు సేసి గోపికలు భాసిల్లంగ గోపాలు రు
త్తుంగాంగంబులతోడ నెల్లకడలం ద్రుళ్లంగ గోబృందముల్
మాంగల్యాకృతిఁ గ్రాల నెంతయును సామగ్ర్యంబునం బంధు లు
ప్పొంగం బల్లె సముజ్జ్వలోత్సవములం బొంగారె నానాఁటికిన్.

27


క.

క్షేమంకరుఁడై హరి దము, నేమఱక ప్రయోజనంబు లెల్ల నడపఁగా
శ్రీమంతు లైరి మిగులఁగ, నామందం గలుగుగోపు లందఱు దోడ్తోన్.

28


క.

వేసవియందును సులభము, ఘాసము గోవులకు నీరు కడుఁ బెల్లొదవన్
వాసవుఁడు గురియుఁ దఱితో, వాసవుతోఁబుట్టు వున్న వాసక్షోణిన్.

29


క.

క్రేపులు వర్ధిల్లఁగఁ గడు, నేపెసఁగఁగ మొదవు లీను నేఁటేట వృష
వ్యాపారం బవ్యాహత, మై పరఁగుం గృష్ణదేవు నాదరమహిమన్.

30


వ.

ఇట్లు బలదేవసహితుం డై మహితప్రీతిం బ్రవర్తిల్లు నయ్యదుకుమారుండు క్రమం
బునం ద్రయోదశవర్షవయస్కుం డయ్యె నంత నొక్కతఱి వసంతసమయావసానం బగుటయు.

31

గ్రీష్మకాలాభివర్ణనము

శా.

వాసంతీకుసుమావతంసకము లుద్వాసించి గోపాంగనల్
శ్రీసంపన్నములైన పాటలములన్ సీమంతసీమ ల్లలిం

  1. గుడుమలు
  2. దొడ్డులకు