పుట:హరివంశము.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

హరివంశము


చ.

దనుజవిభంజనార్థముగ దారుణయుద్ధ మొనర్ప నీవు వో
యిన నఖిలక్రియా[1]తతియు నే మటుబాయఁగఁ బెట్టి నిన్నె చిం
తన మొనరించుచుండితిమి ధన్యుల మైతిమి నేఁడు నీజయం
బునఁ బరమేశ మాకొలువు మోదమెలర్పఁగఁ గైకొనం దగున్.

191


వ.

అనిన వారియాలాపంబు లాలించి యభ్యర్చనంబు లాదరించి [2]యందఱం బ్రత్యేక
పరిగ్రహంబున ననుగ్రహించి యద్దేవుం డాదిదేవుం డటఁ బితామహునకుం
బ్రణమిల్లి వీడ్కొని తదీయలోకంబు వెలువడి తనకుం బురాణసంశ్రయం బగు
దుగ్ధసాగరంబున కరిగి.

192


మ.

ఇనచంద్రద్యుతికోటికిం జోరగ రా కెల్లప్పు[3]డున్ గర్భవా
సనసామగ్రిన తేజరిల్లుచు నజస్వారాజులం దొట్టి యె
వ్వనికిన్ దుర్గమమైనపుణ్యపదమున్ వైకుంఠనామంబు న
ర్థి నధిష్ఠించి యనంతరంబ పరమోద్దీపస్వరూపంబునన్.

193

నారాయణుండు యోగనిద్రాపరాయణుం డై యుండుట

ఉ.

వేయుశిరంబు లొప్పఁ బది[4]వేలుకరంబు లెలర్ప నొప్పి నా
రాయణుఁ డార్య మైన తనయంచితతల్పముఁ జెంది పెక్కు వేల్
హాయనముల్ పరిభ్రమణ మందుట నొందినడప్పిమాన్ప భ
ద్రాయితసుప్తిఁ గోరి కనుదమ్ముల[5]దోయి యొకింత మోడ్చినన్.

194


మ.

మును గల్పాంతమునందు విచ్చలవిడిన్ మోదంబు [6]వర్ధిల్లఁగాఁ
దను బ్రాపించి [7]చిరోపభోగమహిమన్ ధన్యాత్మయై విశ్వమో
హన నాఁ బ్రాజ్ఞులచేతఁ గీర్తనలు నిండారంగఁ గన్నట్టి ని
ద్ర నెఱిం జెందెఁ దదీయభావము సముద్యద్దివ్యయోగాకృతిన్.

195


వ.

ఇవ్విధంబున నిద్రితాత్ముండై యద్దేవుండు.

196


ఉ.

ఈతఁడు నిత్యసుప్తుఁ డని యిచ్చఁ దలంపఁగఁ గొంద ఱీతఁ డు
ద్యోతితసత్త్వబోధుఁ డని యూహ మొనర్పఁగఁ గొంద ఱీతఁ డు
ద్ధూతవికారుఁ డిట్టిఁ డనఁ [8]దోఁచెడువాఁ డనఁ గొంద ఱచ్యుతుం
డాతతలీల [9]చూపి దనుజారులకున్ భరమయ్యె నాత్మలన్[10].

197
  1. వితతి
  2. యందఱిం
  3. డాత్మానుధావనతేజోమహిమన్; ఆత్మావధాపనతేజోమహిమన్ వెలుంగుచు.
  4. వేలభుజంబు
  5. దోయొకయింత
  6. సంధిల్లఁగాఁ
  7. విలోపభోగమహిమన్
  8. దోఁచునెనా, నొక కొంద.
  9. చూవె
  10. జాగర్తికో౽త్ర కః శేతే కశ్చ శక్తశ్చ (సుప్తశ్చ)నేంగతే
    కో భోగవాన్ కో ద్యుతిమాన్ కృష్ణాత్ కృష్ణతర శ్చ కః — 1-50-17.