పుట:హరివంశము.pdf/155

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 4

107


సీ.

ఘర్మాంతమున సుప్తి గైకొని యతఁడు ప్రమోదింపఁ బర్జన్యుఁ డాదరమునఁ
[1]బుష్కలావర్తకంబులు [2]లోనుగాగ సర్వపలాహకంబులఁ బనిచి జగము
నాప్లావితము సేయు[3]నప్పుడు వర్తిల్ల కుడుగు యజ్ఞాదిమహోత్సవములు
మేఘాపగమమున మేల్కనఁగా సర్వకల్యాణములు సమగ్రతఁ దలిర్చుఁ


తే.

బతిఁ బతివ్రత యనిశంబుఁ బరిచరించు, నట్లు విభు నిచ్చ యెఱిఁగి యిట్లనుసరించు
చుండు నయ్యోగనిద్ర యన్యుల కశక్య, నిష్ఠ కల్పంబు లిటు లోలి నిద్ర సలుప.

198


వ.

ఒక్కొక్క కారణంబున నాభీలదర్పులగు దానవులవలన భువనంబులకు నుపద్రవం
బులు దనికినం దలరు దివిజులదుస్థితి యెఱింగి యయ్యాదిపురుషుండు గర
ణీయానురూపంబులగు [4]నవతారంబు లంగీకరించి జగన్మంగళంబు
నిర్వహించు నని యిట్లు వైశంపాయనుండు విష్ణుమూలప్రకృతియుఁ దదీయా
వతారకారణంబులు జనమేజయునకు సవిస్తరంబుగాఁ దెలిపినవిధంబు.

199


శా.

లోకస్తుత్యచరిత్ర నిత్యకరణా[5]లోలన్మనస్సూత్ర య
స్తోకశ్రీతులితామరేంద్ర జనచక్షుఃపూర్ణిమాచంద్ర దా
నాకల్పోజ్జ్వలహస్తపద్మశశిచూడాధీన ధీపద్మస
ర్పాకారస్ఫుటబాహువిక్రమనికామాస్తోదయ[6]ప్రక్రమా.

200


క.

ధీరసకలార్థిలోకా, ధార జితవికార సుకృత[7]ధారలసితస
ద్ధారాదుర్దిననిర్ముషి, తారిద్యుతిభార నిత్యహర్షస్మేరా.

201


మాలిని.

వితతవినయవిద్యా విప్రధర్మాత్మవిద్యా
జితసకలసపత్నశ్రీక సమ్యగ్వివేకా
మతివిభవమహేంద్రామాత్యసౌజన్యనిత్యా
చతురచతురుపాయా [8]సక్తసత్త్వైకయుక్తా.

201


గద్యము.

ఇది శ్రీశంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీ సూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన శ్రీహరివంశంబునం బూర్వభాగంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. పుష్కలావర్తాబ్దములు
  2. లోనుగాఁగల బహుపలాహకకోటి
  3. నపుడు ప్ర
  4. రూపంబుల
  5. లుభ్యన్మహత్సూత్ర
  6. ప్రక్రియ
  7. ధారాయితస; ధారాయ ఏలన; ధారార్థవితా
  8. సత్యసర్వైక