పుట:హరివంశము.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3

67


శ్రుతమున నీగి ధర్మమున శూరత ధీరత సంయమంబునన్
వ్రతమున నంచుఁ బాడె సురవర్యమునీంద్ర సభాంతరంబులన్.

113


క.

విను పంచాశీతిసహ, స్రనిరూపితహాయనములు సకలోర్వియుఁ బా
లన సేసి పిదప భార్గవ, ఘనపరశువువలన నతఁడు గనియె విముక్తిన్.

114


వ.

అట్టి కార్తవీర్యునకు శూరుండును శూరసేనుండును [1]ధృష్టుండును గృష్ణుండును
జయధ్వజుండును ననఁ బుత్రపంచకంబు వెలసె నందు జయధ్వజుం డవంతీశ్వరుఁ
డై తాలజంఘుం గనియె నతనికి నూర్వురు పుట్టి తాలజంఘాఖ్యు లైరి వారి
లోన వంశకరుం డైన వృషునకు మధువు పుట్టె మధువునకు వృష్ణి యుద్భవించె
నివ్విధంబున యదువువలన యాదవులును మధువువలన మాధవులును వృష్ణి
వలన వృష్ణులు నను పేళ్ల హైహయులు ప్రసిద్ధి బొందిరి యయాతిసంభవు [2]లేవుర
వంశంబు లివి యని వైశంపాయనుండు.

115


క.

ఈయదువంశంబులు విను, ధీయుతునకుఁ [3]గలుగు సంతతియుఁ బ్రాభవమున్
శ్రీయును [4]నధికవిభూతియు, నాయువు ననఁ బరఁగుశుభము లైదును ననఘా.

116


తే.

పంచభూతాత్మ మైన ప్రపంచ మెల్లఁ, దారయై యొప్పుచున్న యుదారపుణ్యు
లలఘు లై [5]పంచవంశ్యుల నభినుతింపఁ, గలుగు బంచేంద్రియార్థమాంగల్యయుక్తి.

117

యదువంశక్రమంబు సంక్షేపరూపంబునం జెప్పుట

వ.

ఇంక నఖిలజగత్ప్రభుం డగుపురుషోత్తమునకుం బ్రభవస్థానం బైన [6]యదుని తృతీ
యపుత్రుం డగు క్రోష్టునన్వయంబు వినుము. క్రోష్టునిపుత్రుండు [7]వృజి నీతిమం
తుండు స్వాహి యనుతనయులం బుట్టించె స్వాహికి రుశుంకుండును రుశుంకునకుఁ
చిత్రరథుండును బుట్టిరి.

118


క.

అతనికి శశిబిందుఁడు వి, శ్రుతవిభవుఁడు శతసహస్రసుదతీదయితుం
డతులితసుతదశకోటి, స్థితికారి జనించె నప్రతిమపుణ్యుఁ డిలన్.

119


తే.

అన్నరేంద్రునినందను లందఱకును, నాద్యుఁ డైనపృథుశ్రవుఁ డంతరుఁ డను
తనయుఁ బడసెను యజ్ఞుఁ డాతనితనూజుఁ, డుషతుఁ డామహీవిభునియాత్మోద్భవుండు.

120


క.

ఘనుఁడు [8]శితేపుం డతనికిఁ, దనూజుఁడు మరుత్తుఁ డనఁగఁ దత్ప్రభవుం డ
జ్జనపతి కంబళబర్హిషుఁ, గనియె నశఁడు పుత్రశతముఁ గాంక్షించి తగన్.

121


వ.

మహనీయంబు లగు దానధర్మంబు లనేకంబు లనుష్టించుచుండం బుత్రశతతుల్యుం
డయి రుక్మకవచుం డనువాఁడు పుట్టి పరాక్రమంబునఁ బ్రసిద్ధి నొంది కవచ
ధనుర్బాణధాతు లగు వైరుల నూర్వురరాజుల వధియించి రాజ్యపదంబు సంస్థి
తంబుగా నొందె నతనికిఁ బరాజిత్తన నిక్కంపుఁబేరివాఁడు పుట్టె నాపరాజిత్తునకు

  1. వృషుండు
  2. లపూర్వ
  3. గలదు
  4. గీర్తి
  5. తరసంభవం బిది యభి
  6. యదూత్పత్తియదు
  7. స్వాజి
  8. శినేయుం