పుట:హరివంశము.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

హరివంశము


రుక్ముండు పృథురుక్ముండు [1]జ్యామదుండు పాలితుండు హరి యన నేవురు గొడు
కులు గలిగి రందుఁ బాలితహరితు లనువారి నిద్దఱను దండ్రి యధ్వరంబున మహా
ద్విజులకు దక్షిణగా నిచ్చె రుక్ముండు రాజై పృథురుక్ముం డాప్తుండుగా నుండె.

122


క.

[2]జ్యామదుఁడు రాజ్య మొల్లక, సామజనిభ[3]గమన యైనశైబ్య దనపురం
ధ్రీమణితోఁ జనుదేరఁగ, శ్రీమహితుఁడు గానఁ దపము సేయఁగ నరిగెన్.

123


సీ.

అట్లు ప్రశాంతుఁడై యారణ్యకద్విజవినుతమై యొప్పువర్తనముతోడ
నుండంగ నొకవిప్రుఁ డుత్తమ[4]నృపధర్మకోవిదుం డాతని వేవిధముల
బోధించి దండంబు పోలదు తపము భూపతులకు నను బుద్ధి పట్టుకొనఁగఁ
జెప్పిన నారాజు చింతించి యన్నలు పొందిన సిరిదిక్కు వోవ నొల్ల


తే.

కరిగి [5]ఋక్షవద్గిరితటమందు శుక్తి, మతి యనంగఁ బేర్చినపురి [6]నతులశక్తి
నాక్రమించి యచ్చటు గుటుంబాధివాస, ముగ నొనర్చి మహాభుజస్ఫూర్తి యెసఁగ.

124


వ.

ఒక్కరుండును రథం బెక్కి యడియాలంబుతోడిపడగ యుల్లసిల్ల నుద్దీప్తదాప
ధరుం డై నర్మదయు మృత్తికావతియు నను మహానదుల యుపాంతదేశంబులు
జయించుటకై వెడలిన.

125


ఉ.

ఆతని[7]దాడికిం దలఁకి యచ్చటివీడులరాజు లెల్ల న
త్యాతురులై కళత్రతనయాప్తసుహృద్రథవాజి వారణ
వ్రాతము లుజ్జగించి పఱవంగఁ దొడంగి రతండు హాసవి
ద్యోతముఖాంబుజుం డగుచుఁ దోలె విరోధిచయంబుఁ గన్కనిన్.

126


తే.

[8]అయ్య యమ్మ దమ్ముఁ [9]డన యని పిలుచుచుఁ దల్లి బిడ్డ పట్టెఱుఁగక తల్లడమున
బాలవృద్ధదుర్బలులు గీడ్వడఁగఁ గాంది, శీకులైరి దేశములయశేషజనులు.

127

జ్యామదుం డనురాజు వనంబున నున్న కన్నియం గొనివచ్చుట

వ.

ఆ సమయంబున.

128


సీ.

కాటుకకన్నీరు కస్తూరికాపత్రకాంతకపోల[10]ంపుఁ గాంతిఁ బెనుప
వీడిన పెన్నెఱివేణి విచిత్రనవీనాభ్రమై కమ్మవిరులు గురియఁ
దూఁగాడుపయ్యెద దోదూయమానమన్మథవైజయంతికామహిమఁ బడయఁ
గరుపారునెమ్మేను కమనీయచైత్రకోరకితలతా[11]సధర్మతఁ దలిర్ప


తే.

వెఱుపు సేయుచేఁతలు తన్ను వితతభద్ర, లక్షణంబు లై యిట్టు లలంకరింప
నొంటిపడి చిక్కి పోలేక యున్న కన్నెఁ, గనియె నొక్కతె [12]నచట నాజనవిభుండు.

129


క.

కని యోడకు మని చేరం, జని రాజతనూజఁ గా నిజం బరసి యెఱిం

  1. జ్యామఘుండు
  2. జ్యామఘుఁడు
  3. గామి
  4. నృపకోటి
  5. ఋక్షవత్తటమున యందు
  6. యతుల
  7. ధాటికిం
  8. అయ్య యన్నదమ్ములను రమ్మనుచుఁ బిలుచు ... బాలవృత దుర్బలులు గ్రస్సిపడఁగఁ గాంది...
  9. డస
  10. రేఖలకు నొసఁగ
  11. సమర్థత
  12. నెదుర