పుట:హరవిలాసము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 59



ఉ. పుట్టు వెఱుంగ నెవ్వరికిఁ బోలదు మూఁడవకన్నుఁ జూచి చే
పట్టఁడు వెఱ్ఱివాఁ డయినఁ బ్రాణహరుం డఁట జంతుకోటికిన్
గట్టిన తోలుచీర కలకల్మిప్రకాశము సేయుచున్న దె
ప్పట్టునఁ జూచినన్ శివుని బైసి యెఱుంగఁగరాదు భామినీ. 29

తే. మాట లేటికిఁ జాలింపుమా తపంబు, హరునిఁ గూర్చి సరోజపత్రాయతాక్షి!
వలదు తివియంగఁ బాఁతినవాఁడికొఱ్ఱు, యూపసత్క్రియకర్హమై యున్నె చెపుమ. 30

వ. అనిన నక్కపటవటునకు నవ్వధూటి యి ట్లనియె. 31

ఉ. చాలు వివాదము ల్పదిగ శంభునిగూరిచి యిట్టిపల్కు లీ
వాలము చేసి పల్కితివి యైనను నౌ విను చంద్రమఃకళా
నూళిపయి న్మదీయ మగుమానస మెంతయుఁ జిక్కె నింక నేఁ
జాలుదు నయ్య యెమ్మెయి భుజంగవిభూషణునిం దొరంగఁగన్. 32

వ. అని జయావిజయలం గనుంగొని యపాంగంబులఁ గెంపు గదుర నీ బ్రహ్మచారి శంకరుని గుఱించి యింకను వంకరకొంకరమాటలాడ నుంకించుచున్నవాఁ డితని మెడ వట్టి నూకుం డని పల్కి కోపావేశంబున. 33

చ. జిలుఁ గగువల్కలాంచలము చెన్నయి చన్నులమీఁద జాఱఁగా
నలుకఁ దుషారశైలసుత యవ్వలిమో మయి నాలుగేన్పదం
బులు సని భ్రూకుటీకుటిలముగ్ధలలాటముఖేందుబింబ యై
మలఁగి కనుంగొనెన్ భుజగమండను నక్కపటద్విజోత్తమున్. 34

శా. సాక్షాత్కారముఁ జెందె నవ్వుచు గిరీశానుండు ధాత్రీధరా
ధ్యక్షాపత్యముఁ బ్రేమనిర్భరకటాక్షాలోకనప్రౌఢిమన్
వీక్షించెన్ దరళాక్షియు న్మనమున న్వ్రీడాప్రమోదక్షమా
దాక్షిణ్యంబులు సందడింప నిలిచెం దత్సన్నిధానంబునన్. 35

చ. అరు దగునీతపమ్మునకు నమ్ముడువోయితి నేలుకొమ్ము నీ
వరవుడ నంచు శూలి ప్రియవాక్యములం దగ గారవింపఁగా
ధరణిధరేంద్రనందన యుదగ్రతపోమహనీయవేదనా
భర మఖిలంబు వీడ్కొలిపి భావమునం బరితోష మందుచున్. 36

వ. జయవిజయ లనుప్రాణసఖులతోడం గూడ మాతండ్రి హిమవత్పర్వతేంద్రుండు దేవరకుఁ బ్రమాణీకరింపం బాత్రం బయ్యెను. కన్యకం బితృపరాధీన నగుట దేవరు చిత్తంబున నవధరింపవలయు నని విన్నపంబు సేయించిన. 37

తే. అమృతకరమౌళి యవుఁ గాక యనుచుఁ బలికి, వేడ్క గిరిరాజనందన వీడుకొలిపి
తారగిరి కేఁగి దివ్యచిత్తమునఁ దలఁచె, సప్తమునుల నరుంధతీసంయుతముగ. 38