పుట:హరవిలాసము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58 హరవిలాసము

గాని యొరు నన్వేషించునే? నిట్టూర్పుగాడ్పులచే దుర్లభజనానురాగంబు నీయందుఁ దేటపడుచున్నది. అట్టి కఠినహృదయుం డెవ్వండొ వాఁడెవ్వని నపేక్షించియేని నీవు తపంబు సేయుచుఁ గలమాగ్రపింగళం బగుజటాభారంబు ధరియింపఁ దగ దని యంత నిలువక యక్కపటవటుండు. 24

ఉ. ఏనును బ్రహ్మచారిఁ దరళేక్షణ! నీవును గన్య వెంతకా
లానకు నీకుఁ బెండ్లియ ఫలం బగునేని విచార మేల స
స్థానముతోడ నచ్చునను మాన్యు వివాహము గమ్ము లెమ్ము కా
దేనిఁ దపంబులోనిసగ మిచ్చెద మాను తపోభిమానమున్. 25

వ. అనినం బార్వతి యమ్మిథ్యావటునకుం దనమనోరథం బెఱిఁగింప నొల్లక వయస్యంగన్నుసన్న సేసిన నచ్చెలికత్తెయు నత్తపోధనకుమారునితో ని ట్లనియె. అయ్యా! నీకుఁ గుతూహలంబు గలదేని వినుము. కాలకంఠకఠోరకంఠహుంకారప్రవర్తకం బగుపుష్పచాపునిసమ్మోహనాస్త్రం బీకన్యహృదయంబున నాటిన నాఁటంగోలె లలాటచందనధూసరాలక యై తుహినసంఘాతతతశిలాతలం బగుజనకునింట ధృతిం జెందక మహేంద్రప్రభృతు లగుదిగీశుల నుజ్జగించి పినాకపాణిం బతిఁ గాఁ గోరి తపంబు సేయ సమకట్టె. సబాష్పకంఠస్ఖలితంబు లగుసంగీతాక్షరంబుల విరూపాక్షుచరిత్రంబు పాడుచు వనాంతసఖు లగుకిన్నరరాజకన్యకల వగపించుచుఁ ద్రిభాగశేషంబు లగునిశాసమయంబుల నించుకించుక నిద్రించుచుఁ గలఁ గాంచి నీలకంఠ! యెచ్చోటికిం జనియెద వని యసత్యకంఠార్పితబాహుబంధన యయ్యును విరహవ్యథాదుస్సహం బగుతపోభారంబున భర్గు వశీకరింపం దలంచి యున్నయది యనిపల్కిన. 26

చ. వికవిక నవ్వి యక్కపటవిప్రకుమారుఁడు మేలు లెస్స వా
నికి నయి రాగబంధమును నిల్పె మదిం దరళాయతాక్షి మీ
సకియ వివాహవేళఁ బురశాసనుపాణిఁ బరిగ్రహించుచో
మొకమున బుస్సుమంచు నహి మోగిన నెట్లు భయంబు చెందునో. 27

సీ. రాయంచ యంచుఁ జీరకు జోక యగుఁగాక పచ్చియేనికతోలుఁబచ్చడంబు
హరిచందనాస్పదం బగుచనుఁగవమీఁద బట్టుఁ జేకొనుఁ గాక భసితధూళి
కమనీయచరణలాక్షారాగలేఖచే ముద్రితం బగుఁ గాక రుద్రభూమి
కలితముక్తాఫలగ్రైవేయకంబుతోఁ దులదూఁగుఁ గాక పెంజిలువపేరు
తే. మనువు లెస్సయి యుండెఁ బో మానవతికి
నివ్విధం బన్న లోకంబు లెల్ల నగరె
యహహ! ముదిగొడ్డు నెక్కి బిక్షాటనంబుఁ
జేయఁబోవుట యదియు మేల్చాయ చువ్వె. 28