పుట:హరవిలాసము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 47

వ. నీప్రసాదంబున మలయానిలంబు ప్రాపును వసంతంబుసహాయంబును నిండువెన్నెల చెలిమియుం గలుగఁ బినాకపాణి యగుహరు నైన జయింపం జాలుదు నని తలంతుం దక్కినవారు నాకెవ్వరు నెంత యని యుత్సాహంబునం బల్కినం బురందరుండు సంకల్పితార్థంబు సఫలం బయ్యెనని యంతరంగంబున సంతోషించుచుఁ గంతున కి ట్లనియె. 48

సీ. సంకల్పసంభవ సమకూర్తు వట్లనే యరుగంగ నీ కసాధ్యంబు గలదె
యటుకాన కానిమహాకార్యభరమునం దేము నియోగింతు మిపుడు నిన్ను
ధరణిభారధురీణతాప్రౌఢి కని కదా తను మోఁచు శేషునిఁ బనిచెను హరి
విబుధకార్యార్థంబు విశ్వేశ్వరు గుఱించి యరుగంగవలయు నీ వధికభక్తి
తే. కుధరకన్యను శశిమౌళిఁ గూర్పవలయుఁ, బార్వతీపరమేశ్వర ప్రభవ మైన
దివ్యతేజంబు సేనాపతిత్వ మొంది, జయముఁ గావించు నని చెప్పె జలజభవుఁడు. 49

వ. హిమాద్రిపాదంబున దేవదారువనంబున నియతాత్ముఁ డై పరబ్రహ్మానుసంధానంబు సేయుచు నంధకారాతి తపంబు సేయుచున్నవాఁడు పార్వతియు హిమవన్నియోగంబున నీశ్వరునకుం బాయక పరిచర్య సేయుచున్నయది యీవార్త సకలలోకవృత్తాంతవిజ్ఞానార్థంబు పంపిన యప్సరస్త్రీవర్గంబువలన వింటి నిది కార్య క్రమంబు. 50

తే. ఇది యనన్య సాధారణ మిది యవశ్య, మిది పరోపకృతిక్రియాభ్యుదయశాలి
చేయు మిప్పని సంకల్పసిద్ధి గాఁగ, బాహువిక్రమపారీణ పంచబాణ. 51

తే. కోరి యభ్యర్థనము సేయువారు సురలు, కార్య మూహింప మూఁడులోకమ్ములకును
నతిశుభము కృత్యమో యల్ప మైనఁ గాదు, కామసంస్పృహణీయవిక్రముఁడ వీవు. 52

వ. హుతాశనునకు సమీరంబుంబలె మధుమాసంబు సహాయం బగుం గాత మర్థలాభంబును సేమంబును బునర్దర్శనంబు నయ్యెడు మని దీవించిన దేవేంద్రునియానతి ముత్యాలసేసబోలె శిరంబునఁ దాల్చి యైరావణకుంభికుంభాస్ఫాలనకర్కశం బగు కరంబున వాస్తోష్పతి తన్ను సంస్పర్శించి గౌరవించిన మన్మథుండు మధుసహాయుండై హిమవత్పర్వతంబు సేరం జనియు నాసమయంబునందు. 53

చ. సకలవనంబులందుఁ గలసంయమికోటి తపస్సమాధిని
స్ఠకుఁ బ్రతికూలవర్తి యయి షట్పదకోకిలరాజకీరజా
లకములతోడఁ గూడ ఝషలాంఛను నెచ్చెలికాఁడు వచ్చె వా
రక మధుమాసరాజు నవరాగసమంచితపల్లవాస్త్రుఁడై. 54

తే. ఉత్తరాభిముఖుం డైనయుష్ణరశ్మి, చంద మీక్షించి దక్షిణాశాపురంధ్రి
గంధవాహంబు దీర్ఘదీర్ఘంబు గాఁగఁ, జాఁగ విడిచెను విరహనిశ్శ్వాసధార. 55