Jump to content

పుట:హరవిలాసము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46 హరవిలాసము



వ. అక్కాలంబునం దొక్కనాఁడు స్వర్గలోకంబునఁ బాకశాసనుండు కల్పానోకహంబులనీడలఁ జింతామణి వేదికాస్థలంబులందు బృందారకులు పరివేష్టింపఁ బేరోలగం బుండి దివిజకార్యార్థసంసిద్ధిఁ బొంద మనంబునందుఁ గందర్పునిం దలంచిన. 37

సీ. కాంతాజనంబుల కఱివంక బొమలతోఁ బ్రతివచ్చు పుష్పచాపంబుతోడఁ
గోకిలవ్రాతంబు గ్రుక్కిళ్లు మ్రింగించు క్రొమ్మావిచిగురాకుగొడుగుతోడఁ
రతిదేవినిడుసోగఁ గ్రాలుకన్నులడాలుఁ దలపించు మీనకేతనముతోడ
భుజగలీలావతీభుక్తశేషము లైన గంధవాహకిశోరకములతోడఁ
తే. జందురునితో వసంతమాసంబుతోడ, రాజకీరరథం బెక్కి ప్రాభవమున
వచ్చె వలరాజు చిత్రానువర్తనముగ, సంభ్రమముతో మహేంద్రు నాస్థానమునకు. 38

ఉ. పక్షము పెంపునం గుసుమబాణుని మీఁదనె వ్రాలె దేవతా
ధ్యక్షుని వేయికన్నులును దక్కిన వేల్పుల నుజ్జగించి సూ
క్ష్మేక్షికఁ జూడఁ గార్యగతి యిట్టిదయౌ ప్రభువుల్ ప్రయోజనా
పేక్ష నొకప్పు డాశ్రితులపేర సమంచితగౌరవోన్నతుల్?.39

క. రా యిటు రమ్మని చేతికిఁ, జే యిచ్చి ప్రమోదరేఖ చిగురొత్త మరు
న్నాయకుఁడు నిల్పె సుమన, స్సాయకు సరిగద్దెమీఁద సౌహార్దమునన్. 40

వ. అప్పుడు. 41

తే. పతిప్రసాదంబుఁ దనమౌళిపై ధరించి, మహితవినయావనమ్రుఁడై మన్మథుండు
సంగతంబుగ హస్తాంబుజములు మోడ్చి, విస్ఫురోక్తుల నిట్లని విన్నవించె. 42

వ. దేవర నన్నుఁ దలంపున నవధరించిన కారణం బేమి యానతిమ్ము. 43

సీ. ఎవ్వండు నీపదం బెలమి నుద్దేశించి యతిఘోర మగుతపం బాచరించె
నెవ్వండు నీచిత్త మెరియించుచున్నాఁడు కైవల్యపదవికైఁ కాలుసాఁచి
యెవ్వండు గురునీతి కేపాకమును బొంద కుద్దండరీతి మాఱొడ్డి నిలిచె
నెవ్వండు దంభోళిహేతినిర్ఝరధారఁ దలఁచె నీలోత్పలధారఁ గాఁగ
తే. వాని భంజింతు నాతనిమాన మడఁతు, నతని నిర్జింతు నాతని నతకరింతు
నానతిమ్ము మహేంద్ర నాయట్టిహితుఁడు, నీకుఁ గలుగ నసాధ్యంబు నెగడు నెందు. 44

తే. ఏకభర్తృవ్రతస్థ యై యేలతాంగి, నీకుఁ జేయాడుధర్మంబు నిలువరించె
నది వినిర్ముక్తలజ్జ యై యమరరాజుఁ, జేయుఁ గాత స్వయంగ్రహాశ్లేషణంబు. 45

తే. ప్రణయకోపప్రశాంతికై పాదపతితు, నిన్ను నేపువుఁబోఁడి మన్నింప దయ్యె
నాలతాంగిఁ బ్రవాళశయ్యాశరణ్య, దేహఁ గావింతు విడువు సందేహ మింద్ర. 46

క. నీవజ్రము సుఖముండుం, గావుత దివ్యాస్త్రశాలికామధ్యమునన్
దేవేంద్ర చెఱకువింటం, బూవులు శరములుగ నే రిపుల నిర్జింతున్. 47