పుట:హంసవింశతి.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

lx


ఒకనాఁడు సుప్రభ దిక్కుతోఁపక పాడుకొనుచుండఁగా నాకసమునఁబోవు ముని యొకఁడు దిగివచ్చెను. ఈమె యతనిఁ గవయఁ బోయెను. ఆతఁడు జితేంద్రియుఁడు. అతనికిఁ గావలసినది సంగీతమేకాని సాంగత్యము కాదు. దయ దలఁచి యతఁడొక మంత్రమిచ్చి పోయెను. ఆ మంత్రప్రభావమున సుప్రభయు నుపవనికిఁ బోయి వనపాలకుని గూడెను.

సవతు లిద్దఱు యథేచ్చముగాఁ దమ యుపవనిలోఁ దమ యుపపతులతోఁ గేళి సలుపుచుండిరి.

ఒకనాఁటిరేయి భర్త రాఁడని తెలిసి భార్య లుపవనికిఁ బోయిరి. ఏదో మూలిక కావలెనని భర్తయు నపుడే యుపవనికిఁ బోయేను. భార్య లిద్దఱు భర్త కంటఁబడిరి. అతఁడు ఘర్షించి ప్రశ్నించెను. సతులు నవ్వి "మేము నీ భార్యలము కాము. వనదేవతలము. నీ భార్యలు మా యంశజలు. మేము వసంతుని శాపముచే మానవసేవ చేయవలసిన వారము. ఆ కర్మము మా యంశజల కిచ్చి, బతిమాలుకొని మేము బయటఁ బడితిమి. అందుఛేత మా పోలికలు నీ సతులందుఁ గలవు పొ" మ్మనిరి. ఆతఁడు విశ్వసింపక, తన మేడకుఁ జూడఁ బోయెను. వారతనికంటె ముందుగనే పోయి పవళించియుండిరి. అతఁడు వారినిఁ జూచి విశ్వసించి సుఖపడెను.


★ ★ ★