పుట:హంసవింశతి.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 103



తే. కీర్తికై భద్రకారుఁ డా ధూర్తునకుఁ ద
నింటనే యన్నవస్త్రాదు లిడుచుఁ గల్గు
పనులు నేర్పుచు నుండంగ భక్తి మీఱ
నలఘుశుశ్రూష సేయుచు నాతఁ డుండె. 198

క. కందువ మాటల బెళుకుల
మందస్మిత రుచిర వచన మాధురి చేతన్
దుందుడుకుఁ జెంద ధూర్తుని
డెందముఁ గరఁగించి చెలి ఘటించెను రతికిన్. 199

తే. ఎడతెగని మోహ మూరించి యేపు రేఁపి,
వేశ్మమున నొంటిపాటైన వేళలందు
మదన కదనంబునకుఁ జాల మరులు కొనఁగఁ
జేసె శుభవాటి ధూర్తుని చిత్తమలర. 200

చ. అలయక భద్రకారుఁడు గృహంబున నుండిన యప్పుడెల్ల వే
డ్కలఁ బను లభ్యసించుచుఁ దడంబడ కాతఁడు లేనివేళలం
జెలఁగుచు వాని భార్యకడఁ జేరి మనోభవకేళికాక్రియల్
తొలఁగక యభ్యసించు శశితుల్యుఁడు ధూర్తసమాఖ్యుఁ డున్నతిన్. 201

తే. స్నానపానాన్నవస్త్రాదిసంగ్రహంబు
భద్రకారుఁడు సెలవిచ్చెఁ బనికి మెచ్చి
వాని చెలువంబునకు మెచ్చి వలచినపుడు
చాల శుభవాటి సెలవిచ్చె సంగమంబు. 202

క. ఈ తీరు సకలభోగము
లాతతగతి నడచుచుండ నా ధూరాఖ్యుం డా
తలిరుఁగత్తి గల దొర
చేతి కటారికిని సడ్డ సేయక యుండెన్. 203