పుట:హంసవింశతి.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102 హంస వింశతి



క. దాని నెగాదిగఁ జూడని
మానవునిన్ దాని పొందు మదిలో నెపుడుం
బూని తలంపని పురుషునిఁ
గానము త్రిభువనములందుఁ గలవారలలోన్. 191

క. ఆ శుభవాటి మనోహర
పేశల తర మృదుల వాక్య పృథు మాధురికై
యాశపడి మార భూతా
వేశమునఁ జరించు వీటి విటయూథమ్ముల్. 192

శా. నీవీబంధముఁ జక్కదిద్దు? నెఱివేణిన్ లెస్సఁ గైసేయుఁ గె
మ్మోవిన్ జిల్కు దరస్మితంబు, జిగిచూపు ల్వాఱఁగాఁ జూచుచుం
గ్రేవల్ గన్పడఁ జేయు, నెచ్చెలియతోఁ గేల్కేల దట్టించి, వా
చావైచిత్రిని ముచ్చటాడు సకి, తన జారుల్ విలోకింపఁగన్. 193

తే. ఇటుల మదమెత్తి తమిచేత నేపురేఁగి
తిరుగు నవ్వీటఁ గల్గిన ధీర విటుల
పొందునకు నాసపడి పోవ సందులేక
కుందుచుండును విరహార్తిఁ జెంది యెపుడు. 194

వ. అంత. 195

మ. చిగురుంగత్తి వజీరు మాఱుపఱుపన్ జెన్నొందు నొయ్యారపున్
సొగసుంబ్రాయము గల్గువాఁ డొకఁడు మేల్సొన్నారి ధూర్తాఖ్యచేఁ
దగఁ బెంపొందినవాఁడు శిల్పఘనశాస్త్రప్రక్రియ న్నేర్వఁగాఁ
దెగువ న్నిల్చెను భద్రకారునకు నంతేవాసియై వేడుకన్. 196

క. వాని కుశలత్వ సంపద
వాని మనోహారి రూప వర వైభవమున్
వాని ఘన బుద్ధిఁ జూచి య
హీనకరుణ నింటనిల్పి హిత మలరారన్. 197