పుట:హంసవింశతి.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104 హంస వింశతి



వ. అయ్యవసరంబున. 204

ఉ. ఆదర మొప్ప నొక్క దివసాంతమునందు దుకాణమున్ బహి
ర్వేదిని భద్రకారుఁ డమరించుక ధూర్తునిఁ జూచి మిద్దెలో
బోదియమీఁద నున్న తుల పొందుగ వే కొని రమ్మటంచు స
మ్మోదముతోడ నంపఁగ సముద్రగభీరుఁడు పోయి చూడఁగన్. 205

తే. వాని యొయ్యార మొక వింత యైన నపుడు
చూచి వలరాజు రాజ్యంబు చూఱఁ గొనఁగఁ
దలచి శుభవాటి ధూర్తుతోఁ దారసిల్లి
తలుపు గదియించి రతికేళి సలుపుచుండె. 206

క. చెన్నారి చుంబనంబులఁ
జిన్నారివగల్ వినోదచేష్టలుఁ జిన్నెల్
గన్నారఁ జూపి యపుడా
సొన్నారి మిటారి ధూర్తు సురతులఁ గరఁచెన్. 207

క. ఈ లీల మదనకదనా
లోలత్వముఁ బూని యింటిలోపల ధూర్తుం
డాలస్యం బొనరించిన
దాలిమి చెడి భద్రకారధన్యుఁడు చింతన్. 208

చ. తడసె నదేమొ ధూర్తుఁ డల దర్పకుఁ బోలినవాఁడు భార్యయుం
గడు రతిఁబోలు రూపుసిరి గల్గిన జవ్వని యేమి ద్రోహమున్
గడిమి నొనర్చిరో యనుచుఁ గాలటు నిల్వక వచ్చి గట్టిగా
గడెనిడు తల్పుఁ జూచి ఘనగర్జితభాషలఁ బిల్చె శిష్యునిన్. 209

తే. అప్పు డాజాయ యేచాయ నధిపు మదికి
హితముగా బొంకవలయునో యెఱుఁగు మనుచు
హంస మడిగిన దరహాస మలర మోము
వంచి హేమవతీ సాధ్వి యంచ కనియె. 210