పుట:హంసవింశతి.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiii

అను శ్లోకార్థమును బుక్కిటఁ బెట్టికాని, కవి యీ కథలు కల్పించెను. దీనికిఁ దోడు మనపాలిటి కింకొక శ్లోకరత్నము - అందఱకుఁ దెలిసిన దున్నది.

శ్లో. స్త్రీణాం ద్విగుణ ఆహారో
    బుద్ధిశ్చాపి చతుర్గుణా
    సాహసం షడ్గుణం చైవ
    కామో౽ష్టగుణ ఉచ్యతే.

నారాయణకవి యీ నాలుగింటిని కోటి కెక్కించి చూపినాఁడు.

తిండి యధికముగాఁ దినుటచేఁ బొడము బెడఁదయు నుడువక విడువలేదు.

తే. పిఱుఁదు పిక్కలు చెక్కులు బెడఁగు దొడలు
    వెడఁద యొడలును జన్నులు వెండ్రుకిడను
    సందు లేకుండ బలియుట సకియ మనసు
    జార సంభోగ కేళికి స్వారి వెడలె. (హంస. 3-133)

గ్రంథము కామినీగర్హణముతోనే మొదలెత్తినాఁడు.

క. మంకులు మాయోపాయలు
   బొంకుల పుట్ట లతిపాపపుం జగజంతల్
   జంకెనలు సేయు యువతులు
   శంకరుఁడుం దగఁడు వారి చర్యలు దెలియన్. (1-37)

బుద్దిచాతుర్యము, దాని మించిన సాహసము, దాని మించిన కామము, స్త్రీ యందు భాసించు తీరులు చూపినాఁడు. ఆవేకథలు. ఏదో యొక విపత్తు పుట్టి మునిఁగినట్లు తటస్థించుట, బుద్ధిశక్తిచే దానిని దేలికగా దాఁటుట కథా సామాన్య లక్షణము. ఈ కథలను శుద్ధముగా వచనమున రచించి పెట్టినచో ఇంత వన్నె కెక్కవు. కథాచమత్కారము యొక్క తలఁదన్ను పద్య రచనా సంబంధి చమత్కారము లిందుఁ గొల్లలుగా నున్నవి.