పుట:హంసవింశతి.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xii

శుకసప్తతిలో బేతాళభటులొక రాజకుమారు నెత్తుకొనిపోయి వేఱొక రాజ శుద్ధాంతమునఁజేర్చి, యద్భుతశృంగార మొలికించుకథ కలదు. అటువంటి కథల జోలికి మనకవి పోలేదు. ఒకనాతికిఁ బాదుకలిప్పించి గగనయానము సాధ్యము చేసినాఁడు. ఒక గోతికి మంత్రమునిప్పించి యాకసమునఁ ద్రిప్పినాఁడు. ఇంతకు మించి అస్వాభావిక సన్నివేశములు సృష్టింపలేదు.

ఇందు 2,6,11, 13,20 కథలైదు బ్రాహ్మణకుటుంబకథలు. తొలికథలో ఱంకు బొంకు లేదు. కాశినుండి లింగముదెచ్చుట, గుడిగట్టించుట యున్నది. 6 కథలోఁ జలిపందిరిలో బాటసారులకు నీళ్లుపోయు ద్విజ జారిణి ద్విజజారునే కోరును. 11 కథలో ద్విజపండితుని పెద్దభార్య ద్విజభిక్షువునే కోరును.13 కథలో నియోగిద్విజునిభార్య జోస్యునే కోరును. 20 కథలో మంత్రికుమారుని భార్యలకు ద్విజులే తటస్థపడుదురు. ఒక నియోగివటువు 5 కథలోఁ బెండ్లికాని గొల్లపడుచును జెఱచును. ఒక వైదికవటువు 19 కథలో గాండ్ల మగనాలిని గవయును. 10 కథలో నొక భూతచికిత్సకుని భార్యతో నూరికరణము సంబంధము పెట్టుకొనును. ఇందు ద్విజస్త్రీలు నీతిదప్పినను, గులము తప్పి చరింపరు: పురుషులు చరింతురు. కోమటి, తొగట (సాలే, తొగట, జాండ్ర నేఁతనేయు కులములు మూడు) గొల్ల, కంసాలి, చిత్తారి, రెడ్డి (కాఁపు) బెస్త, కుమ్మరి, బలిజ, గాండ్ల కులముల స్త్రీ పురుషులకు నియమము పెట్టలేదు. ఈ కథలలో యథేష్టముగఁ జరింతురు.

కథల పుట్టుక

భర్తృహరి శృంగార శతకమునఁ జెప్పిన

శ్లో. జల్పంతి సార్థ మన్యేన
    పశ్యం త్యన్యం సవిభ్రమాః
    హృద్గతం చింతయం త్యన్యం
    ప్రియః కో నామ యోషితామ్ ?

(ఒకనితోఁ దియ్యగా మాటాడుదురు. ఒకని నొయ్యారముగాఁ జూతురు. ఒకనిని మనసులోఁ దలఁతురు. స్త్రీలకుఁ బ్రియుఁ డెవఁడు? పచ్చి మోసకత్తెలు.)