పుట:హంసవింశతి.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xi

ఈ పద్యమునకుఁ బోటీగా హంసవింశతి.

సీ. మినుకొప్పు నునుగొప్పు మినమినల్ దూలాడఁ
         గన్నుల ధళధళల్ మిన్నులాడఁ
   బునుఁగిడ్డ నెఱపూఁత భుగభుగల్ చెరలాడ
         గుబ్బల చకచకల్ ద్రొబ్బులాడ
   జిగిపూని తగుమేని ధగధగల్ దిరుగాడ
         నగుమోము నిగనిగల్ నాట్యమాడ
   గుమిగూడు విరిదండ ఘుమఘుమల్ పొరలాడ
         నందెల ఝళఝళల్ చిందులాడ

తే. నెదుట సాక్షాత్కరించు మోహినికి నతఁడు
    గరిమతో లేచి మ్రొక్కినఁ గరుణఁజూచి (హంస. 4-98)

ఈ పద్యముఁ జెప్పినది. మోహినిత్రుళ్లుపాటు – మినమినల్, ధళధళల్, భుగభుగల్, చకచకల్, ధగధగల్, నిగనిగల్, ఘుమఘుమల్, ఝళఝళల్ కూర్చి విజృంభితముగాఁజెప్పినది. దానికిది తీసిపోదు; మించును.

శుకసప్తతి మోహిని “దీర్ఘలోచనరుచితోడ వేఁడుచు ముద్దువెట్టుకోఁజనుట, అతఁడు నిర్వికారమతిఁ జాఁగిలిమ్రొక్కి నిలుచుట" మనకవికి రుచింపలేదు. అనుచితమని భావించి మోహిని సాక్షాత్కరించెనని మాత్రమే చెప్పినాఁడు. మోహిని లక్ష్మీ పార్వతీ సరస్వతీదేవతలవంటి దేవత యనుకొన్నాఁడు. కాదు. క్షుద్రదేవత. ప్రథమరస విజృంభణవృత్తితో సాక్షాత్కరించు మోహినిని జూచి, సాధకుఁడు మనసుచెదరి తబ్బిబ్బగు ప్రమాద ముండును. ఆదేవత వానికిఁ గామవికారము రేకెత్తించు చిన్నెలెన్నో చూపును. వాఁడు చలించెనా, నెత్తురుక్రక్కి చచ్చును. ఈ రహస్యము సాధకులెఱుఁగుదురు. మనకవియు “గుబ్బల చకచకల్ ద్రొబ్బులాడ" అనుపంక్తిలో మోహిని గాఢపరిరంభమే యభిలషించు చున్నదను భావము వ్యంజితముచేసినాఁడని సరిపెట్టుకొనఁగూడదా? అన్నచో సరిపెట్టుకొనవచ్చును. కవియుద్దేశ మదికాదే: శుకసప్తతియందలి యనౌచిత్యమును బరిహరింపవలెనను పట్టుదల. ఇది సరికాదు.