పుట:హంసవింశతి.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xiv

మనుచరిత్రకుఁ బ్రశస్తి వచ్చినది. కవితా పితామహుని శిష్యుఁడు, గురువును మించిన శిష్యు డనిపించు కొనవలెనని మనుచరిత్ర మార్గము ననుసరించి వసుచరిత్ర వ్రాసెను. శ్రమపడి యక్కడలేని చమత్కారము లెన్నో ప్రదర్శించెను. కథను దీసివేసి, లోకము ఆ చమత్కారములనే కై కొనెను. ఆ శిల్పమునకుఁ బ్రత్యేక స్థితి సిద్ధించెను.

కదిరీపతి శుకసప్తతిని జూచి, దాని మించిన దనిపించుకొన వలెనని, నారాయణామాత్యుడు హంసవింశతి రచించెను. శ్రమపడి యక్కడలేని విశేషము లెన్నో ప్రపంచించి ప్రదర్శించెను. లోకమునకు నా విశేషములే యుపా దేయములైనవి.

హంసవింశతి విశేషములు.

మృగ పక్షి జాతులు, కోళ్లు, మేకలు, పొట్టేళ్లు, కొండలు, కంపలు, చెట్లు, దీవులు, మనువులు, మానములు, వర్షములు, ఖండములు, దేశములు, పంటలు, వడ్లు, కూరగాయలు, పడవలు, చేపలు, పుణ్యక్షేత్రములు, తీర్థములు, నదులు, సరస్సులు, పుష్కరిణులు, 108 తిరుపతులు, అమ్మవార్లు, గడ్డి, అప్సరసలు, వస్త్రములు, పాత్రలు, భూషణములు, పట్టణములు, పల్లెలు, బాల బాలికలక్రీడలు ఎన్ని రకము లున్నవో అన్నియు గుది గ్రుచ్చి సీసపద్యములు, అవి చాలకున్న సీసమాలికలు, రగడలు, వచనాలు కుప్పవోయుటయందు నారాయణకవి యందెవేసిన చేయి.

భూగోళ ఖగోళ జ్ఞానము, ఆయుర్వేద ధనుర్వేద పరిచితి, భరత సంగీత కళాశాస్త్ర పరిచితి, జ్యోతిర్గణిత మంత్ర యోగశాస్త్ర పరిచితి, శాస్త్రీయ దేశీయ పద్ధతులు కలియఁ గలిపి చూపించుటకే కొన్ని కథలు సందర్భములు కల్పించుకొనెను.

ఆ కాలపుఁ దెలుఁగు ప్రజల కులాచార వృత్తులు, స్నాన భోజన శయనాదులు, వేష భాషలు, తెలిసికొనఁ గోరు వారి కీ ప్రబంధ మాదర్శముగా, నుండులాగున రచించెను.