పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ

ఒకవేళ చీఁకటింటికి దీప మిడినట్లు
                   తేటగా సర్వంబు దెలిసియుండు
నొకవేళ నీహార మెనసిన పద్మంబు
                   గతిఁ బోల్పఁదగి మందమతిగ నుండు
నొకవేళ ద్విరద మూరక త్రొక్కిన కొలంకు
                   పగిది నెంతయుఁ గల్కబారియుండు
నొకవేళ క్రొత్తనీటికి మీను బ్రాకిన
                   కరణి మహాశలఁ దిరుగుచుండు


తే.

గాని నిశ్చలపడదు నామానసంబు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

88


సీ.

సర్వజ్ఞుఁడవు నీవ చతురావనుఁడ వీవ
                   శతమఖముఖసర్సితతులు నీవ
పద్మినీబాంధవప్రముఖగ్రహము నీవ
                   వసుధాదిపంచతత్వములు నీవ
సురసిద్ధచారణగరుడోరగులునీవ
                   వడినిభకల్పకగిరులు నీవ
వరునతోడుతను దివారాత్రములు నీవ
                   వేదాధ్వరతదంగవిధులు నీవ


తే.

నీవ సర్వంబు సర్వంబు నీవ కావె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

89


సీ.

బహుజన్మకృతతపఃఫలముగా నిను గన్న
                   తల్లిదండ్రుల చెఱఁ దగులజేసి
చిరమోహితల గోపతరుణుల విడనాడి
                   పంశరవ్యధపాలు జేసి
విశ్వసించిన పాండవేయుల నడవుల
                   నెడలేని యిడుముల గుడువజేసి
ధాత్రీసురుని సహాధ్యాపకు భవధంఘ్రి
                   చింతనాపరుని కుచేలుఁ జేసి


తే.

శ్రితజనావన బిరుదు గట్టితివి భళిర
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

90