పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అక్రూర, విదుర, భీష్మాంబరీషులయందు
                   గల దయారస మింత జిలుకుమయ్య
ప్రహ్లాద, ముచికుంద, పార్ధముఖ్యుల మున్ను
                   గన్న చల్లనిచూడ్కిఁ గనఁగదయ్య
శబరి, నహల్య, పాంచాలి, నుత్తర నెట్లు
                   బ్రోచితివో యట్లు బ్రోవుమయ్య
ధృవ, విభీషణ, గృహోద్ధలపైగల కూర్మి
                   నించుక నాయెడ నుంచుమయ్య


తే.

నమ్మినాడను పోషించ న్యాయమయ్య
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

91


సీ.

జాంబవధ్భలుకేశ్వరముష్టిహతులకు
                   బ్రీతి తప్పని నాటిప్రేమ యున్న
బ్రహ్మర్షిరాట్భ్రుగుపాదప్రహారంబు
                   సైచిననాఁటివాత్సల్య మున్న
గంగాసుతాస్త్రసంఘట్టన కాజిలో
                   కోప మొందనినాటిఁకూర్మి యున్న
పారుజాతాసక్తపాకశాసనవజ్ర
                   ఘాత కోర్చిననాటికరుణ యున్న


తే.

నస్మదపచారములు గారు టరుదె నీకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

92


సీ.

రవికోటితేజోవిరాజితసాహస్ర
                   కిరణచక్రమున కంజలి ఘటించి
పరభయదాశ్రితాభయదస్యనాంచిత
                   పాంచజన్యం బాత్మ బ్రస్తుతించి
స్వర్ణప్రభామేరుసారాత్యుదారకౌ
                   మోదకీగదకు కేల్మోడ్పు జేసి
యసుజీవాభీలహతపరాయణశుభ
                   నందకం బనిశంబు నతు లొనర్చి


తే.

శార్ఙ్గము భజించి యంత మీశరణు జెంది
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

93