పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

నెరనమ్మియుంటి దేవరచిత్తమున కించు
                   కెరుకలేదొ మది కరుగఁలేదొ
నారాయణా జగన్నాథ కృష్ణా యని
                   పిలువగాఁ వినరాదొ బలుకరాదొ
యాపదుద్ధారకా యనుచు దీనత వేడ
                   జాలిలేదో యిపు డేలరాదొ
బంటుబంటనటంచుఁ బ్రార్థించి కొలిచిన
                   బ్రీతి లేదో ప్రభుఖ్యాతి గాదొ


తే.

లోకనాయక నీకు పరాకు దగునె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

85


సీ.

వసుమతి దేవకీవసుదేవసుతుఁడవై
                   నందఘోషమునఁ జెల్వొంద నిలచి
జారచోరాదిచేష్టల వేడ్క విహరించి
                   గోగోపకుల బ్రోవ గోత్ర మెత్తి
కంససాల్వమురాది కస్టుల దునుమూడి
                   ద్వారకాపురము వింతగ రచించి
శ్రీరుక్మిణీస్త్రీల వివాహమై
                   పాండవవంశంబు బ్రబలఁజేయ


తే.

వేఁ నుతించెదగాని ని న్నెఱుఁగగలనె
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

86


సీ.

ఋణపాతకంబు దారుణ మేమి సేయనో
                   పూని యిందుల కీవె పూటఁబడుము
సంసారజంది యెచ్చట ముంచివేయునో
                   గట్టిగా నీవు చేపట్టియుండు
మేమరింపున మృత్యు వెట్లు భంగించునో
                   గరుణ నిప్పుడె మమ్ము గట్టుకొనుము
కర్మంబు లెట్టిదుర్గతుల నొప్పించునో
                   లొలగక వేవేళ తోడు రమ్ము


తే.

విఘ్నములఁ బాసి మిమ్ము సేవింపవలయు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

87