పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తనకు కళేబరంబునకు భేదజ్ఞాన
                   మతిలేనివాని నిర్మలత యెంత?
తనువు వర్ణించినంతట జీవుఁ డేమౌనొ
                   తెలియనివాని తాత్విక మదెంత?
కన్నతండ్రిని జగత్కర్తను నిన్నాత్మ
                   బోధఁ జేయనివానిబుద్ది యెంత?
భవజరామరణాదిభయనివారణమైన
                   పదముఁ జేరనివాని భాగ్య మెంత?


తే.

యేమి నేరని నను బ్రోచు టిదియె వింత
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

43


సీ.

రాసవిలాసగోపీసహస్రదృఢోప
                   గూహనంబులు గావు కూడి వీడ
జననీనిబద్ధనిస్థరిశితోలూఖల
                   తజ్జువుల్ గావు శీఘ్రత సడల్ప
బృందావనస్థలపృధులగుల్మలతాంత
                   షండముల్ గావు నిశ్శంక విడువ
గర్వితరాక్షసోత్కరకల్పితానేక
                   మాయలు గావు మర్మమున బాయ


తే.

మాటతో గట్టి నిల్పుదు మానసమున
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

44


సీ.

తల్లిదండ్రుల చెర దప్పింప గంసుని
                   హతుని గావించు టార్తావనంబొ?
బాణుబాహాగర్వభంగం బొనర్చి నీ
                   పౌత్రు దెచ్చుట జగద్భద్రకరమొ?
ధార్తరాష్ట్రులఁ జంపి ధాత్రీతలము మేన
                   బావ కిచ్చుట దీనబాంధవంబొ?
అన్నగారివిరోధులగు దానవుల నాజి
                   బొరియించు టది సర్వసోషణంబొ?


తే.

రుకణ నీవారి బ్రోచుటే బిరుదు నీకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

45