పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

పరకాంత లనక గోపస్త్రీలనందఱిఁ
                   జేరి క్రీడించిన చిన్నతనము
వావి గాదనక రాధావధూటీమణిఁ
                   బాయక కూడిన పడుచుఁదనము
నగుబాటు లనక నింపగురాణి యలిగినఁ
                   ద్రోయక మ్రొక్కిన దుడుకుఁదనము
లాఘవం బనక మెలఁగ జరాసంధుని
                   భీతిచేఁ బారిన పిరికితనము


తే.

గుట్టు విడ రట్టొనర్తు చేపట్టనేని
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

46


సీ.

విరథుఁడై యున్నభాస్కరపుత్ర నాజిలో
                   నరునిచేఁ జంపింప న్యాయమగునె?
ధర్మజుచే నసత్యఁపుఁబల్కుఁ బల్కించి
                   గురుని ద్రుంపించుట గొప్పదనమె?
గంగాకుమారు శిఖండి యుద్ధంబునఁ
                   బడఁగూల్పఁజూచుట పౌరుషంబె?
మారుతిచే యధర్మముగా సుయోధను
                   తొడలు దున్మించుట దొడ్డతనమె?


తే.

ఇట్టి పుణ్యుండ వన్ననీగుట్టు గన్న
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

47


సీ.

అత్యున్నతాకారి వయ్యు బలీంద్రుని
                   యాచించుచో గుజ్జ వైతి వీవు
అనఘ సద్గుణశాలి వయ్యు సత్రాజిత్తు
                   వజ్ర మిమ్మని నిందఁ బడితి వీవు
అఖిలపూజార్హుఁడ వయ్యు విప్రుల నన్న
                   మడిగి యగౌరవం బంది తీవు
అసహాయశూరుఁడ వయ్యు దైవత వీటి
                   పారుజాతము గొంచు పాఱి తీవు


తే.

ఘనుల కైనను యాచ్న లాఘవమె సుమ్ము
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

48