పుట:హంసలదీవి వేణుగోపాల శతకము.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

భువనమోహనుని కాముని గన్నతండ్రి నీ
                   చెలువ మింతింతని చెప్పవశమె
పతితపావని గంగ సుతయై చెలంగునీ
                   పుణ్య మింతింతని పొగడవశమె
కలుము లొసంగు శ్రీకలవాణి నీరాణి
                   భాగ్య మింతింతని పలుకవశమె
దివ్యతేజోబలాధికులు నీభృత్యులు
                   అధికార మింతింత యనఁగవశమె


తే.

నీసమానుఁడ వన్నింట నీవెకాని
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

40


సీ.

హరిహరబ్రహ్మాది పరదైవతాంతరా
                   నేకరూపంబుల నిన్ను దెలిపి
వస్తుభేదాభేదవాదిశబ్దార్థోక్తి
                   నిగమాగమంబుల నిన్ను దెలిపి
పుణ్యతీర్ధక్షేత్రముల ధరాస్థలియందు
                   నిర్నిద్రమహిమల నిన్ను దెలిపి
దానదయానత్య మానవగోవిప్ర
                   నిజవర్తనంబుల నిన్ను దెలిపి


తే.

చేతనుల నిట్లు తరియింపఁ జేసి తీవు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

41


సీ.

నిరపరాధులకు నీశరణత్వ మెందుకు
                   నిష్ణాత్ములకు నీదునియతి యేమి
భాగ్యవంతులకు నీపరిపాలనం బేల
                   ధర్మజ్ఞులకు నీదుతత్వ మరుదె
ఘనబుద్ధులకు నీదుకార్య మేమున్నది
                   సత్యవాదులకు నీసాక్షి ఘనమె
తత్వవేత్తలకు నీదాక్షిణ్యమున నేమి
                   నిస్సంగులకు నీమనీష యేల


తే.

కిల్బిషాత్ముని నను బ్రోవ కీ ర్తినీకు
భావజవిలాస! హంసలదీవివాస!
లలితకృష్ణాబ్దిసంగమస్థలవిహార!
పరమకరుణాస్వభావ! గోపాలదేవ!

42